11, అక్టోబర్ 2009, ఆదివారం

విత్తనం తండ్లాట...

లు కన్నీళ్లుగా మారిన చోట
ప్రతి ఉలికిపాటు ఒక ఉద్యమం
త్యాగాల నెత్తురులో తడిసిన మట్టి
పోరాట విత్తనం కోసం
కండ్లను భూమిలో పాతుతుంది

భూమిని చీల్చుకుని
ఉద్యమాలు మొలకెత్తడం
ఇక్కడ అనివార్య రసాయనిక చర్య

గడీల మీద వాలిన గబ్బిలం
గతాన్నెందుకో నెమరేస్తున్నది
రాత్రి చలి మంట కాడ కలిసిన సేతులు
బతుకు కొలిమి మంటను యాది చేసుకుంటున్నయ్
అయ్ గుండెల పుట్టిన మాటైన
అవ్వ గొంతుల పురుడు పోసుకున్న పాటైన
బతుకమ్మైన, బోనాల డప్పుల సప్పుడైనా...
ప్రతి కదలికా ఇక్కడ కవిత్వమే

ఊళ్లు కొడవండ్లవడం
మాటలు పాటలుగా మారడం
ఇక్కడ రెండూ ఒక్కటే
జాగ్రత్తగా వింటే....
వినగలిగితే
ఇక్కడి కీచురాళ్లు కూడా
ఏండ్ల నాటి గుండెకోతనంత
పాటలల్లి పాడడం వినిపిస్తుంది
ఊళ్లల్ల గుడిసెల మీది మొలిసిన జెండాలు
మోసపోయినతనానికి ఆనవాళ్లుగా మిగిలిపోతాయి.
తనువంతా పుండ్లైన సెరువు
చేతిని నొసిటికి అతికించుకొని
పొలిమేర దిక్కు పుట్టెడాశతో చూస్తుంటది

ఒక పిడికెడ మట్టిని
కండ్లకద్దుకుంటే చాలు
ఇక్కడి బతుకు బతుకంతా
వీరుల కథలై పెయ్ రోమాలు కత్తులవుతాయి

బక్క రైతు దున్నిన దుక్కినిండా
కొత్తరకం విత్తనాలు
మొలకెత్తడానికి సిద్ధమవుతున్నయ్
ఇగ ఏలెటోళ్లకు అన్నీా నిద్ర లేని రాత్రులే
దోచుక తిన్నోళ్లకు గుండెల నిండా గుబులే