11, అక్టోబర్ 2009, ఆదివారం

ఒక ద్రోహపు గాయం

వంచన రగిల్చిన కుంపటి సెగల్లో
హృదయాన్ని వేపుకున్నాక
గాయాల బాధదేముంది చెప్పు -

దేహంలో ప్రవహిస్తున్న
మరణం కరాళ నృత్యాన్ని కళ్లారా చూసాక
కొత్తగా భయాల బాధేముంది చెప్పు -

మనసులు ద్వేషాల పరికి కంపలో చిక్కుకుని
చీము రక్తాలు నిండిన పుండైనాక
అవమానాల బాధేముంది చెప్పు-

మానవీయ బంధాల పూదోటల్ని
అంటువెట్టి బూడిద కుప్ప చేసాక
ఒంటరితనపు గాయాలదేముంది చెప్పు -

నా నీడే నన్ను తాకరాదని
కోర్కెల చిత్రహింసల కొలిమికి బలి చేశాక
కొత్తగా నిర్బంధాల బాధేముంది చెప్పు -

విశ్వాసపు రెక్కలు విరిగి
ద్రోహాల అగాధాల్లో అల్లాడుతున్నప్పుడు
షిజోఫ్రీనిక్ ముద్రలదేముంది చెప్పు -

బతుకు మీద
ఎన్నెన్ని ద్రోహపు గాయాలు
ఎన్నెన్ని అవహేళనపు మాటలు

చెరిపేసుకుందామని చేయి చాస్తానా
మరో పెద్ద గాయం
మరో పెద్ద మచ్చ-

మోయలేనన్ని బాధల బరువులు
చెరిపేసుకోలేనన్ని గాయాల మచ్చలు
ఏ బాధను చల్లార్చుకోవడానికి ఒలుకుతున్నామో
తెలియని కన్నీటి బిందువులు -
ఏ మలుపునిస్తుందో తెలియని
అలుముకుంటున్న ఒంటరి చీకటి రాత్రి.