ఎంత స్వేచ్ఛగా తలుపులు బార్లా తెరిచి ఆహ్వానించుకునే వాళ్లం
అపార్ట్ మెంట్ల కాంక్రీట్ మనుషుల మధ్య మూసి వున్న గుమ్మం
వెక్కిరిస్తూ వుంటుంది
కట్టలు తెగే కన్నీళ్ల స్రవంతి...
... బాధలు సరే, విజయాల్ని చెప్పుకునేందుకు
మనిషి కానరాడే
నగరం .... హడావుడి జీవన స్రవంతిలో
సేద తీర్చే ఆలంబన కరువు
మోసం గాలి వీచినంత సులువైనప్పుడు
మానవత్వం బిక్కుబిక్కుమని ఈసుమంటుంది
లెక్కలే నిత్యం లెక్కకు మించి వున్నప్పుడు
మనమూ అలానే మెదిలే జీవనం మరింత నరకప్రాయం
బతకనేర్వడమే అస్తిత్వానికి ఆధారమవుతున్నప్పుడు
గుండె గాయమవుతుంది
ఎరుక ఉంటే చాలు... ఐనా ఆవేదన నిత్యకృత్యమవుతుంది
ఆకాశాన్ని చూడక ఎన్నేళ్లయిందో...
పిచ్చుకల్ని చూడక సంవత్సరమవుతుంది..
ప్రకృతీ ... మానవ ప్రకృతి మృగ్యం, నరకప్రాయం నగరం