ఓ ప్రజాపాలకా! నీవు ప్రజలచే ఎన్నుకొనబడిన సత్యమైన పాలకుడవుగా ప్రవర్తింపుము.దివ్యతేజ స్సంపన్నుడవై ప్రకాశింపుము.నీవు ప్రజల ఆపదలను తొలగించి సన్మార్గమున అభీష్టసిద్ధి నందునట్లు నడిపింపుము.నీకు ప్రజలందరు మోకరిల్లి నమస్కరింతురు.దేవతలు అదృశ్యముగ నిన్ను అనుగ్రహింతురు. న్యాయము-దయ నీకు పరమ ధర్మములు.సంపదను ప్రజాహితమునకై వినియోగింపుము.సద్వర్తనమే నీ కీర్తికి బాట. దృఢమైన దయగల పాలకుడుగ పది కాలములు జీవింపుము. అందరితో కీర్తిని పంచుకొని ఆర్జింపుము.ఆనందింపుము. అహంకారము,అధికారమదము నీ దరిచేరకుండుగాక. (అధర్వణ వేదము-3-4-2)
మరి మన నాయకుడు దీనికి తన భాష్యం ఎలా చెబుతున్నాడో చూద్దాం
నేను పేరుకే ప్రజలచే ఎన్నుకోబడ్డాను కానీ నావెనుక అండగా EVMలున్నాయి తెలుసుగా.అక్రమార్క స్సంపన్నుడనై ప్రకాశిస్తా.ప్రజలు ఒకవేళ పొరపాటున సుఖసంతోషాలతో ఉన్నా వారికి లేని ఆపదలను సృష్టించి అంటే వేర్పాటువాదాలు,మతఘర్షణలు లాంటివి కలిగించి ఇబ్బందుల పాలుజేస్తా.సన్మార్గములో నడిచే వాళ్ళను కూడా పెళ్ళికి ముందు అది తప్పుకాదు ఇది తప్పుకాదు అని న్యాయస్థానాలతో తీర్పులిప్పించి వాళ్ళను చెడిపోయేటట్లు తయారుచేస్తా.ప్రజలందరినీ భయకంపితులనుజేసి నాకు మోకరిల్లేటట్లు చేస్తా.సారావ్యాపారాలు చేస్తూ దేవాలయాల ధర్మకర్తగా దేవతలనే ఓ ఆటాడిస్తా.వాళ్ళు చచ్చినట్లు నన్ననుగ్రహించేటట్లు చేసుకుంటా. అన్యాయము-కాఠిన్యము నాకు పరమ ధర్మములు.దేశసంపదను నా కుటుంబహితమునకు మాత్రమే వినియోగిస్తా.దుర్వర్తనమే నా కీర్తికి రాజమార్గం.దృఢమైన కఠిన హృదయము గల పాలకుడుగా పది కాలాలు జీవిస్తా. సహ మంత్రులందరితో కీర్తిని పంచుకొంటా. ఆనందిస్తా.అహంకారము, అధికారమదమే ఎల్లప్పుడూ నా సుగుణాలుగా భాసిల్లునట్లు చేసుకుంటా.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి