23, ఫిబ్రవరి 2011, బుధవారం

ఆహార భద్రత అంటే చాలీ చాలని సరుకుల్ని తక్కువ రేట్లకు పంచి పేదరికాన్ని మరింత పెంచడమూ, పేదల్ని అవమానించడమా? రైతు భద్రతతో కూడిన ఉత్పాదన, నిల్వలు, పేదల కొనుగోలు శక్తీ పెంచడమా?

ఐరాస రూపొందించిన మానవాభివృద్ధి సూచికలో మన దేశం భూటాన్, లావోస్‌కన్నా వెనుకబడి ఉన్నది. కాని ఇదే దేశంలో ఫోర్బ్స్ పత్రిక జాబితాకెక్కిన 49 మంది శతకోటీశ్వరులు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ప్రభుత్వ సంపదను ఉచితంగా అందుకున్నవారే. నిజానికి డబ్బు కొరత మన దేశానికి లేనేలేదు. ప్రస్తుత బిల్లుకు ఆహార భద్రత అని పేరు పెట్టామే కాని 'ఆహార హక్కు' అనలేదు.
"ప్రతిరంగంలోనూ చైనాను అధిగమించడమే మన టార్గెట్" అంటూ ఆడంభరంగా చెప్పుకునే మన నేతలు (వాస్థవానికి అత్యంత జనాభాగల దేశంగా తప్ప మరే విషయంలోనూ ఇప్పట్లో మనకది సాధ్యం కాదు) అదే చైనా జూన్ 1, 2009 నుండే "ఆహార భద్రతా చట్టాన్ని" అమలు చెయ్యడమేకాకుండా ఇప్పుడు దాన్ని మరింత మెరుగు పరిచి నాణ్యమైన "నూతన ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థను" రూపొందించేందుకు ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి కృషి చేస్తోంది" అనే విషయం తెలియదనుకోవాలా?
ఆహార భద్రత అనే ఓపేరుగొప్ప కార్యక్రమం చేపట్టి తామేదో పేదల్ని ఉద్ధరించబోతున్నట్లు, ప్రపంచంలో ఇంతవరకు ఎవడూ పొడవనిది తామే ప్రధమంగా పొడవబోతున్నట్లు మొన్నటి కాంగ్రేసు ప్లీనరీలో "ఆహారాన్ని ఓ హక్కుగా ప్రజలకు అందించే దేశం ప్రపంచంలో మరొకటి ఉంటుందా?" అంటూ గడసరిగా ఆశ్చర్యాన్ని ప్రకటించి జనాల చెవుల్లో పబ్లిగ్గా పువ్వులు పెట్టాలని చూసిన ప్రణబ్ ముఖర్జీ గారికీ, వారి సోనియమ్మకూ ఈ విషయం తెలియదనుకోవాలా?? దాదాపు 22 దేశాలు ఆహార హక్కును అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఆహార హక్కును బ్రెజిల్ రాజ్యాంగం స్పష్టంగా గుర్తించింది. గత ఏడాది ఫిబ్రవరి 3న అక్కడి ఉభయ సభలూ బిల్లును ఆమోదించాక బ్రెజిల్లో రాజ్యాంగ సవరణను ఆమోదించారు. ఇప్పుడు అక్కడ ఆహార హక్కు రాజ్యాంగపరమైన మానవ హక్కుగా ఏర్పడింది. అదే విధంగా తగినంత ఆహారాన్ని పొందే హక్కును గౌరవించి, రక్షించి, నెరవేర్చాలనే స్పష్టమైన బాధ్యతను రాజ్యానికి కల్పించే అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలపై కూడా బ్రెజిల్ సంతకాలు చేసి, ఆమోదించింది.

ఆమధ్య అమెరికా ప్రెసిడెంటెవడో ఇండియాలో పేదలక్కూడా బలవబట్టే (సంపాదన పెరగడమట!)& తెగతింటుండడంవల్లే ప్రపంచంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయన్నప్పుడు మన నేతలు తెగ గింజుకున్నారు.
ఇప్పుడు మన ఘనతవహించిన యూపీయే పాలక ప్రభువులూ దాదాపు అదేవాగుడు మరోలా వాగారు.
ద్రవ్యోల్భణ కట్టడికై గురువారం నాడు ఉన్నతస్థాయి జుట్టుపీక్కొనే సమావేశంలో "వేగవంతమైన అభివృద్ధివల్ల(??) పేదల చేతుల్లోకూడా డబ్బులు ఉంటున్నాయనీ (ఇంకా నయం పేదలుకూడా డబ్బులెక్కువై స్విస్సు బ్యాంకుల్లో దాచుకుంటున్నారనలేదు!), ఫలితంగా ఆహార వినియోగం పెరిగి దరలు అదుపులో ఉండడంలేదని సూత్రీకరించారు.రోజుకు 11 రూపాయలు సంపాదించేవారు యుపిఎ ప్రభుత్వం దృష్టిలో పేదలు కారట. నిజంగా నేడు 330రూపాయలతో ఒక మనిషి నెలంతా జీవించగలగటమనేది సాధ్యమేనా?

జీవించే హక్కు వాస్తవరూపం దాల్చాలంటే ఆహార హక్కు ప్రాథమికావసరమని మన రాజ్యాంగంలోని 21వ అధికరణం చెబుతోంది. అందరికీ ఆహార భద్రతను హామీ ఇచ్చేందుకు చట్టబద్ధమైన ప్రాతిపదికను అందించే విధంగా జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తామని 2009లో రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన ప్రసంగంలో సూచించారు. పేదలకు నిర్దేశిత హక్కులతో ఆహారానికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇవ్వడం అనేది దేశంలో ఆహారం, పౌష్టికత భద్రతను హామీ ఇచ్చే దిశలో ఒక ముఖ్యమైన చర్యగా భావించారు.
ఈ కొత్త బిల్లు ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 25 కిలోల బియ్యం లేదా గోధుమలు కేజీ 3 రూపాయల వంతున సరఫరా చేయాలి. ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలకు నిర్దేశించిన విధంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో విఫలమైనట్లయితే ఆ కుటుంబాలు 'ఆహార భద్రతా అలవెన్స్‌' నగదు రూపంలో పొందే అవకాశం ఆహార భద్రతా చట్టం కల్పిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ(Targeted Public Distribution System or TPDS) దారిద్య్ర రేఖ(బిపిఎల్)కు దిగువన ఉన్న జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలూ, అవినీతి వల్లా, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లా ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో 15 నుండి 20 రూపాయల వరకూ ఉన్న బియ్యాన్ని(రెండో రకం)2రూపాయలకే అందించడంవల్ల చాలామంది పేదలకు ఉపయోగకరంగానే ఉన్నా, ఎందరో అనర్హులు (కొందరు మధ్య, ఉన్నత స్థాయి వర్గాలకు కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయి), కొందరు మధ్య తరగతి, పేద వర్గాలవారుకూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో 8 నుండి 10రూపాయలకు అమ్ముకుంటున్నారనేది బహిరంగ రహస్యం. దీన్ని అరికట్టడం ప్రభుత్వాలకు చేతకాదని తేలిపోయినందున అంత్యోదయ వర్గాలకుతప్ప మిగతా వర్గాలకు పీడీ్ఎస్ ను పూర్తిగా రద్దుపరచి వారికి నగదు బదిలీ పధకంలాంటివాటిద్వారా సామాజిక రక్షణ కల్పించి వారికి కావలిసిన సరకులేవో వారే (మార్కెట్ ధరలకే) కొనుక్కునేలా చేయడం తద్వారా పీడీ్ఎస్ సరకుల నాణ్యత బాగాలేనందున అవి అమ్ముకొని మంచి బియ్యాన్ని కొనుక్కుంటున్నామనే అపవాదునుండి తప్పుకోవచ్చేమో? అయితే ఇందులోనూ అవే ఇబ్బందులు-అంటే అర్హుల గుర్తింపు, కట్టుదిట్టమైన వ్యవస్థలేకపోవడం వంటివాటివల్ల ఇదికూడా అనర్హుల జేబుల్లోకి చేరడం తద్వారా మరింతమంది సోమరుల్ని తయారు చెయ్యడం జరగొచ్చన్న వాదనలు లేకపోలేదు. అయితే వస్తు సబ్సిడీల ద్వారా అనర్హులకూ లబ్ది చేకూర్చేబదులు బహిరంగ మార్కెట్‌ను ప్రోత్సహించి పేదలకు నగదు సహాయం చెయ్యడమనేది నిజమైన ప్రత్యామ్నాయమని నేను నమ్ముతాను.రైతు సేద్యానికి వాడే ట్రాక్టర్లకిచ్చే డీజిల్ సబ్సిడీ పేరుతో రోల్స్రాయిస్ కార్లలో తిరిగేవాడిక్కూడ సబ్సిడీపై డీజిల్ ఇచ్చే దుష్ట వ్యవస్థను ప్రక్షాలించి గ్రామస్థాయిలో ట్రాక్టర్లుండే రైతన్నలందరికీ నేరుగా డీజిల్ సబ్సిడీ (నగదు ౠపేణా) ఇవ్వండి. ఇదే సూత్రం గ్యాస్ సిలిండర్‌కూ వర్తిస్తుంది. పేదోడికోసమని సిలిండర్ ధర పెంచం. కానీ పెద్దోడు నెలకు ఒకటి వాడితే పేదోడు మూడునాలుగు నెలలకు ఒకటి వాడతాడు. 100లో ఉండే 60మంది ఉండే పేదోళ్ళు సంవత్సరానికి (60X3=180) సిలిండర్లు వాడితే పెద్దోళ్ళు (40X12X1=240) సిలిండర్లు వాడతారు. ఒక్కో సిలిండరుపై పెద్దోళ్ళకు 200 ఎక్కువ వడ్డించి పేదోడికి ఇంకో వంద తగ్గించినా (2400X200-180X100= 10000) ఇంకా 10000 ప్రభుత్వానికి లాభమే:)
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం తరహాలో స్వయం ప్రతిపత్తి గల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు/అనర్హులు అవకతవకలకు పాల్పడకుండా అన్ని బిపిఎల్‌ కుటుంబాలకూ ఆహార ధాన్యాలు కేటాయించగలుగుతాయి.

కామెంట్‌లు లేవు: