31, మార్చి 2011, గురువారం

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి భారత్ పైనల్లో అడుగు పెట్టింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి భారత్ పైనల్లో అడుగు పెట్టింది. మొదట్లో భారత బౌలర్లను భయపెట్టిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. బలమైన భాగస్వామ్యం నెలకొనకుండా భారత బౌలర్లు పాకిస్తాన్‌ను కట్టడి చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఏ మాత్రం ప్రభావం చూపని స్పిన్నర్ హర్భజన్ ఈ మ్యాచు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అతను రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన యువరాజ్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో భారత్ ఏప్రిల్ 2వ తేదీన శ్రీలంకను ఎదుర్కుంటుంది. పాకిస్తాన్‌పై భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీ మ్యాచును చివరి దాకా చూశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా భారత విజయాన్ని ఆస్వాదించారు.


యువరాజ్ సింగ్ 103 పరుగుల పాకిస్తాన్ స్కోరు వద్ద కమ్రాన్ అక్మల్‌ను అవుట్ చేయడంతో పరుగుల వరదకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే 106 పరుగుల వద్ద యువరాజ్ సింగ్ యూనిస్ ఖాన్‌ను అవుట్ చేసి పాకిస్తాన్ వెన్ను విరిచాడు. తొలి ఓవర్లలో ఏ మాత్రం ప్రభావం చూపని భారత ఫాస్ట్ బౌలర్లు ఆ తర్వాతి స్పెల్స్‌లో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు. నెహ్రా చివరి ఓవర్లలో బాగా రాణించాడు. పాకిస్తాన్ స్కోర్ 142 పరుగులు ఉన్నప్పుడు ఉమర్ అక్మల్ అవుట్ కావడంతో దాదాపుగా భారత విజయం ఖాయమైంది. పాకిస్తాన్ కెప్టెన్ ఆఫ్రిదీ దూకుడుగా ఆడి 184 పరుగుల వద్ద హర్భజన్ చేతిలో అవుటయ్యాడు.
నెహ్రా 199 పరుగుల వద్ద రియాజ్ వాహబ్‌ను, 208 పరుగుల వద్ద ఉమర్ గుల్‌ను అవుట్ చేశాడు. పాకిస్తాన్ అప్పటికి 23 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. పాకిస్తాన్ చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది. జహీర్ ఖాన్ బౌలింగ్‌లో మిస్బావుల్ హక్ అదరగొట్టాడు. ఆ తర్వాత మునాఫ్ పటేల్ ఓవర్‌లో అతను ఓ భారీ సిక్స్ కొట్టాడు. ఆ స్థితిలో 49 ఓవర్లలో పాకిస్తాన్ 231 పరుగులు చేసింది. ఒక ఓవరులో పాకిస్తాన్ 30 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవరులో జహీర్ ఖాన్ పాకిస్తాన్‌ను పూర్తిగా కట్టడి చేశాడు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. ఒక బంతి మిగిలి ఉండగా జహీర్ చివరి వికెట్‌ను పడగొట్టాడు. దీంతో భారత్ విజయాన్ని అందుకుంది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో అదరగొట్టింది. వీరేంద్ర సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్సు తర్వాత భారత్ ఆ వేగాన్ని ఏ సందర్భంలోనూ అందుకోలేకపోయింది. భారత బ్యాట్స్‌మెన్ పేలవమైన ఆటనే ప్రదర్సించారని చెప్పవచ్చు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 260 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో సచిన్ టెండూల్కర్ కాస్తా మెరుగ్గా కనిపించాడు. అతనికి కూడా నాలుగు లైఫ్‌లు వచ్చాయి. సెహ్వాగ్ 38 పరుగులకు అవుట్ కాగా, టెండూల్కర్ 85 పరగులు చేశాడు. చివర్లో సురేష్ రైనా కాస్తా మెరుగ్గా ఆడి 36 పరగులు చేయడం వల్ల ఆ కాస్తా స్కోరునైనా చేయగలిగింది. ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా రాణించిన యువరాజ్ సింగ్ డకౌట్ కావడం భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. విరాట్ కోహ్లీ కూడా తక్కువ స్కోరే చేశాడు.

పాకిస్తాన్ బౌలర్ వాహబ్ రియాజ్ భారత బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచాడు. అత్యంత కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచులో అతను ఐదు భారత వికెట్లు పడగొట్టాడు. షోయబ్ అక్తర్‌ను పక్కన పెట్టి తనను తీసుకున్నందుకు తగిన ప్రతిఫలాన్ని పాకిస్తాన్‌కు అందించాడు. ఎప్పటిలాగే భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగులో విఫలమయ్యాడు.

కామెంట్‌లు లేవు: