31, మార్చి 2011, గురువారం

బాబాయ్ - అబ్బాయ్ మధ్య ఉప ఎన్నికల పోరు ప్రారంభమైనట్లే.

కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ సీట్లకు బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి, అబ్బాయ్ వైయస్ జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు ప్రారంభమైనట్లే. ఈ రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. దీంతో వివేకానంద రెడ్డి, జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు జోరందుకుంటుంది. ఇప్పటికే ఈ ఎన్నకలకు కాంగ్రెసు పార్టీ వ్యూహరచన చేసింది. బుధవారంనాడు కడప జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ జిల్లా నాయకులతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, అహ్మదుల్లాలతో పాటు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.


పార్టీ బలహీనంగా ఉన్న జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో పార్టీ ఇంచార్జీలను నియమించాలని కాంగ్రెసు నాయకులు నిర్ణయించుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన వివేకానంద రెడ్డి ఇక పూర్తిగా ఉప ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. వైయస్ జగన్‌ను ఓడించేందుకు తగిన వ్యూహరచన చేస్తున్నారు. జిల్లా నాయకులతో, కార్యకర్తలతో ఆయన తన సంబంధాలను పునరుద్ధరించుకుంటారు. శాసనసభలో జరిగిన వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధపడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి లక్ష్మణుడిలా కాపు కాశానని, ఇందులో భాగంగానే వైయస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీని ఎదుర్కున్నానని ఆయన చెప్పుకునే అవకాశాలున్నాయి.

వైయస్ రాజకీయాలకు వాస్తవంగా తానే వారసుడినని చాటుకోవడానికి ఆయన ప్రయత్నిస్తారు. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో ఆయన తన వదిన వైయస్ విజయలక్ష్మి మీద పోటీ చేయనున్నారు. కడప పార్లమెంటు సీటులో వైయస్ జగన్‌పై తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పోటీకి దించుతున్నారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, తనకు పదవులపై ఆశ లేదని, అయితే వైయస్ ఆశయాలు కొనసాగాలంటే తనను గెలిపించాలని ఆయన ఓటర్లతో చెప్పే అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు: