31, మార్చి 2011, గురువారం

అతను కనిపించేవాడు కాదు,పాత్ర మాత్రమే కనిపించేది

నటుడు నూతన్ ప్రసాద్ ఇక లేరంటే నమ్మడం కష్టమే. బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్‌లో 1989లో ప్రమాదానికి గురై వీల్ చైర్‌కే పరిమితమైనప్పుడు ఒక్కసారి తెలుగు సినీ ప్రేక్షక లోకం ఓసారి విషాద సముద్రంలో మునిగిపోతే, ఇప్పుడు ఆయన మరణవార్త విని కన్నీటి సముద్రమైంది. తెలుగు సినీరంగంపై, ప్రేక్షక లోకంపై నూతన్ ప్రసాద్ వేసిన ముద్ర చిన్నదేమీ కాదు. విభిన్న పాత్రలను పోషించిన నూతన్ ప్రసాద్ ప్రేక్షకులకు ఆయన పోషించిన పాత్ర మాత్రమే కనిపించేది, అతను కనిపించేవాడు కాదు. సునిశితమైన హాస్యంతో విలనిజాన్ని పండించిన ఘనత నూతన్ ప్రసాద్‌కు దక్కుతుంది. తనదైన డిక్షన్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో నూతన్ ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. నూటొక్క జిల్లాల అందగాడు ఎవరంటే ఇప్పటికీ ఆయనే.


నూతన్ ప్రసాద్ 1950 అక్టోబర్ 10వ తేదీన కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. 1973లో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా నటించిన అందాల రాముడు సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. రావుగోపాల రావుతో కలిసి విలనిజాన్ని అతను పండించాడు. ఏ పాత్ర పోషించినా తనదైన ముద్ర వేశాడు. హాస్య నటుడిగా, కెరీర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఆయన విభిన్న పాత్రలను పోషించాడు. ఒక సినిమాలో హీరోగా కూడా చేశాడు. పాత్రకు తగిన మ్యానరిజాన్ని చూపడంలో నూతన్ ప్రసాద్‌ది అందే వేసిన చేయి. నటనలో నూతన్ ప్రసాద్ తమను మించిపోతాడేమోనని సహ నటులు భయపడి పోటీ పడి నటించేవారట.

రాజాధిరాజ సినిమాలో నూతన్ ప్రసాద్ పోషించిన పాత్ర ప్రత్యేకమైంది. కొత్తా దేవుడండీ అనే పాటకు ఆయన నటించిన తీరును తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆయన నోట వచ్చిన దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది అనే డైలాగ్ అన్ని రంగాల్లో ఓ ఊతపదంలా మారింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి పలువురు అగ్ర హీరోలతో కలిసి ఆయన నటించారు. ఎవరితోనూ నూతన్ ప్రసాద్‌కు విభేదాలు గానీ గొడవలు గానీ లేకపోవడం, ఆయనపై ఫిర్యాదులు కూడా లేవు. గాసిప్స్ లేవు. అంటే, అతని వ్యక్తిత్వమేమిటో అర్థం చేసుకోవచ్చు.
తొలి తరం కథానాయకులతో ఎంత విస్తృతంగా ఆయన నటించారో, రెండో తరం కథానాయకులతోనూ అంతే విస్తృతంగా నటించారు. పట్నం వచ్చిన ప్రతివ్రతలు, ఖైదీ, మగమహారాజు, శ్రీవారికి ప్రేమలేఖ, కథానాయకుడు, అహ నా పెళ్లంట వంటి పలు చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. 1984లో నూతన్ ప్రసాద్ నంది అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా ఆయనను వరించింది. అవార్డులు ఆయన విశిష్టతను వ్యక్తం చేయలేవు. ప్రేక్షకులపై, సినీ రంగంపై ఆయన వేసిన విశిష్ట ముద్ర ఎల్లకాలం నిలబడిపోతుంది.

కామెంట్‌లు లేవు: