12, మార్చి 2011, శనివారం

"ఆ విగ్రహాలకు ప్రాణముంటదా? పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు" వింటానికి సిగ్గుగా ఉంది మనకి!!!!

నడి వీధిలో మీ సంస్కృతిని మీరు నగ్నంగా నిలబెట్టి నిర్వచించారు!
మీరేమిటో ప్రపంచానికి చాటారు !
మీ సంస్కారాన్ని బట్టలు విప్పి టాంక్ బండ్ మీద ఊరేగించారు. !
మీ అంతిమ లక్ష్యమేమిటో చూపించారు.మీరు హుసేన్ సాగర్లో వేసింది కేవలం విగ్రహాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మని!
తెలుగు వెలుగులారా..! క్షమించండి!
తన ముద్దు బిడ్డలకు పట్టిన గతి చూసి అల్లంత దూరాన ప్రభుత్వ భవనం ముందు.... నోట్లో చెంగు కుక్కుకుని గోలుగోలున ఏడుస్తున్న తెలుగు తల్లి సాక్షిగా
మేము...చచ్చిపోయాం!
మా రక్తంలో వేడి చల్లారిపోయింది.
మిమ్మల్ని కాపాడుకోలేక ఇళ్ళలో టీవీల ముందు కూచుని కళ్ళు తుడుచుకున్నాం!
NTR.... క్షమించు మమ్మల్ని!
తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని నువ్వు వినిపించినా, దాన్ని ఇవాళ మేము నినదించలేకపోయాం! ........
ఆత్మలు చచ్చిన వాళ్లకు గౌరవం ఎందుకని!
పోలీసుల సాక్షిగా సాగిన దమనకాండ ని చూస్తూ కృష్ణ దేవరాయలకు,బ్రహ్మనాయుడికి హుసేన్ సాగర్ నీళ్లతో తర్పణాలు విడిచాం!
మహనీయులను సదా స్మరించుకునే అవకాశం నువ్విచ్చినా మేము నిలుపుకోలేకపోయాం!
ఎముకలు కుళ్ళి,శక్తులు చచ్చిన వాళ్ళం...క్షమించు....

పదవీ వ్యామోహాలు-కులమత భేదాలు,
భాషాద్వేషాలు చెలరేగె నేడు !
ప్రతి మనిషి మరి యొకరిని దోచుకొనేవాడే,
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే!
స్వార్ధమే అనర్ధదాయకం !
అది చంపుకొనుటే క్షేమదాయకం !