2, ఏప్రిల్ 2011, శనివారం

నువ్వా - నేనా(జూనియర్ ఎన్టీఆర్ - నారా లోకేష్)???!!??

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వారసుడిపై చర్చ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే చంద్రబాబు రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీ నాయకత్వాన్ని వదులుకునే స్థితిలో లేకపోయినప్పటికీ ఆ చర్చ ముందుకు రావడంలోని ఆంతర్యమేమిటనేది అర్థం కావడం లేదు. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. నిజానికి, చంద్రబాబు తప్పుకుంటే ఆ స్థానం స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణకు దక్కాలి. అందుకు బాలకృష్ణ ఉవ్విళ్లూరుతున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, ఎప్పటికప్పుడు ఆయనకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.


పార్టీ నాయకత్వం కోసం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీ రామారావు మధ్య పోటీ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు నారా లోకేష్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. నారా లోకేష్‌కు తన కూతురును ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తాను నాయకత్వం కోసం పోటీ పడకపోవచ్చునని అంటున్నారు. చంద్రబాబు అభిప్రాయానికి అనుగుణంగా ఆయన నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ దూసుకొస్తున్నారు. తన సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురును జూనియర్ ఎన్టీఆర్‌కు పెళ్లి చేస్తున్న చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్‌కు అడ్డు రాకుండా ఈ పెళ్లి ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, పార్టీ కార్యకర్తల నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతు లభిస్తుంది. విశేష జనాదరణ ఆయనకు ఉంది. తాత స్వర్గీయ ఎన్టీ రామారావు లక్షణాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాయకత్వానికి సరిగ్గా సరిపోతాడని అంటున్నారు. జనాదరణ విషయానికి వస్తే నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ పడలేరు. కానీ ఇప్పటికే ఆయన పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తూ పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు చేదోడు వాదోడుగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: