2, ఏప్రిల్ 2011, శనివారం

జగన్ పార్టీ వెంట్రుకతో సమానం

తాను తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తనని, దివంగత ఎన్టీఆర్ కుటుంబానికి అభిమానించేవాడినని అలాంటి తాను ఎట్టి పరిస్థితులలోనూ పార్టీ వీడే అవకాశం లేదని, ఎన్టీఆర్ కుటుంబం మీద తనకు ఉన్న అభిమానం, టిడిపి కార్యకర్తగా తనకు ఉన్న నిబద్దత ముందు అన్నీ వెంట్రుకతో సమానమని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నేత వల్లభనేని వంశీ శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ పార్టీలోకి వెళుతున్నట్లు వచ్చిన వాదనలను దృష్టిలో పెట్టుకొని అన్నారు. తాను జగన్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. టిడిపీలోనే ఉంటానని చెప్పారు. తనకు పార్టీలో పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీ కార్యకర్తగానే పని చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. తమకు ఎప్పుడూ పార్టీ తరఫున పోటీ చేశామని, ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్నప్పటికీ చంద్రబాబు, హరికృష్ణ పర్యటనల విషయం తమకు ఎప్పుడూ చెప్పలేదన్నారు.


హరికృష్ణ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు అవమానించారని అన్నారు. హరికృష్ణకే గౌరవం లేకుంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని అన్నారు. సుజనా చౌదరికి గౌరవం ఇవ్వడాన్ని తాను తప్పుపట్టడం లేదన్నారు. అందరికీ గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకే అవమానం జరిగిందన్నారు. తనకు దేవినేని ఉమపై వ్యక్తిగత కక్షలు లేవన్నారు. మా మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవన్నారు. దేవినేని మాత్రం ఒంటెత్తు పోకడలకు వెళుతున్నాడన్నారు. అందరితో కలిసి దేవినేని ఉమ వెళ్లడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీని ఏకపక్ష ధోరణితో జిల్లాలో భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.

పార్టీలో ఎన్నో ఏళ్ల నుండి ఉన్నప్పటికీ కొడాలి నాని, తాను కార్యకర్తలుగా పని చేస్తున్నామని అన్నారు. పార్టీ పట్ల నిబద్దతతో తాము పని చేస్తున్నామన్నారు. నేను పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు ఎప్పుడైనా పాల్పడ్డట్టు గన్నవరం నియోజకవర్గంలో గానీ, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోగానీ చెప్పించాలన్నారు. వ్యక్తిగతంగా నేను ఎవరినీ విమర్శించలేదన్నారు. దేవినేని ఉమ టిడిపిలో, దేవినేని నెహ్రూ కాంగ్రెసులో, దేవినేని చంద్రశేఖర్ జగన్ వెంట వెళ్లనున్నారని ఇలా మూడు పార్టీలు వారి కుటుంబ సభ్యుల చేతుల్లో ఉండాలని చూస్తున్నారన్నారు. నందమూరి కుటుంబాన్ని గౌరవించనందుకే ఉమతో విభేదిస్తున్నానని చెప్పారు. నైతిక విలువలకు నేను కట్టుబడి ఉండే వ్యక్తిని అన్నారు.

దేవినేని నాయకత్వంలో తాను పని చేయలేకనే రాజీనామా చేశానని, అయితే ఆయన రాజీనామా చేసినందువల్ల నేను కొనసాగుతానని చెప్పారు. ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పారు. ఆయన టిడిపిలో ఉంటే తనకేమి సమస్య కాదని, అయితే ఆయన నాయకత్వంలో మాత్రం పని చేయనన్నారు. అయితే హరికృష్ణకు క్షమాపణలు చెబితే మాత్రం తాను ఆయన నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమని అన్నారు. పార్టీ కోసమే తాను బయటకు మీడియా ముందుకు వచ్చానని, వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రం ఏమీ లేవన్నారు. నెహ్రూ జిల్లాలో టిడిపి కార్యకర్తలపై దాడులు జరుపుతున్నప్పటికీ ఉమ స్పందించడం లేదన్నారు. గతంలో సిపి సీతారామాంజనేయులు వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించలేదన్నారు. పార్టీ కోసం తాము ఎన్నో అవమానాలకు గురయ్యానన్నారు. వారిలా పేపర్లలో ఫోటోలు వేయించుకోవాలన్న పిచ్చి నాకు లేదన్నారు.

చంద్రబాబు కూడా నందమూరి కుటుంబంలో సభ్యుడే అని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యే సీటునో, ఎంపీ సీటునో కోరుకోవడం లేదన్నారు. ఉమను టిడిపినుండి తప్పించాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదన్నారు. ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే చాలన్నారు. దేవినేని అయినా, కొడాలి నాని అయినా వ్యక్తిగతంగా ఎవరూ గెలవలేదని అందరూ టిడిపి పైనే గెలిచారన్నారు. తనకు ఒకరిని నిందించే ఉద్దేశ్యం ఉండదన్నారు. గత సాధారణ ఎన్నికలలో ఓడినప్పుడు కూడా ఎవరినీ నిందించకుండా తాను ఏడు నియోజకవర్గాలను సమన్వయం చేసుకోలేకనే ఓడిపోయానని చెప్పానన్నారు. తాను, బాలగోవర్ధన్ రెడ్డి గత ఎన్నికలలో టిక్కెట్ కోసం పోటీ పడినప్పటికీ ఇప్పుడు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. వంగవీటి రాధాకృష్ణతో కేవలం పరిచయం మాత్రమే అన్నారు. కుటుంబం వేరు రాజకీయం వేరని అన్నారు. అన్ని విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానని ఆయన అన్నారు. తాను ఇప్పుడు దేవినేని ఉమపై చేసే వ్యాఖ్యలు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, పార్టీకి వ్యతిరేకం కాదని పార్టీ ప్రయోజనాల కోసమే అన్నారు.

కామెంట్‌లు లేవు: