2, ఏప్రిల్ 2011, శనివారం

అభ్యుదయవాదం, ఆధునికత పేరుతో నూతనమైన జీవనసరళినే సృష్టించాడు.

సత్యాన్వేషణ పథంలో మానవుడు ఇంతవరకు గమ్యస్థానం చేరలేదు. మానవుడి జీవితానికి ఎటువంటి దిశానిర్దేశం లేక, ఒక విధానమంటూ లేక అస్తవ్యస్తంగా ఉన్న రోజులలో ఒకే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని, దానికెటువంటి ప్రామాణికత లేకపోయినా దానినే గాఢంగా విశ్వసించి,ఆ మార్గంలోనే జీవించటం ప్రారంభించాడు.'విశ్వాసమే సత్యం' గా భావించాడు.దీనివలన మునుపటి అస్తవ్యస్తత తొలగి మానవజీవితానికి నిర్దిష్ఠ విధానమంటూ ఏర్పడింది. ఒక కట్టుబాటు ఏర్పడింది. అప్పటికి ఇదే మానవుడు సాధించిన విజయం.

ఐతే శాస్త్రీయ దృక్పథం లేని కేవల విశ్వాసం వలన మానవజీవితంలో మూఢత్వం నెలకొంది. వికాసం లేక సమాజం శిలా సదృశంగా మారిపోయింది. ఈ విధంగా సమస్య మరో రూపంలో ముందుకొచ్చింది. ఈ సమస్య నుండి బయటపడటానికి మనిషి మరో రకమైన దృక్పథాన్ని ఏర్పరచుకున్నాడు. 'ఏ విషయాన్ని గుడ్డిగా విశ్వసించకూడదు.ఏదైనా సరే ప్రత్యక్షంగా మనం చూడాలి లేదా శాస్త్రీయంగా నిరూపించబడాలి 'అనేదే ఆ కొత్త దృక్పథం. ఈ దృక్పథం వలన మనిషి అపరిమితమైన విజ్ఞానశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. ప్రకృతి మీద అదుపు సాధించాడు. అంతులేని విజయాలు సాధించాడు. అభ్యుదయవాదం, ఆధునికత పేరుతో నూతనమైన జీవనసరళినే సృష్టించాడు. 'శాస్త్రీయతే సత్యం'గా ప్రకటించాడు.

కానీ ఈ ధోరణి వలన ఆర్ధిక రంగంలో అనేక హానికర పరిణామాలు పొడసూపాయి. బలవంతుడు బలహీనుణ్ణి దోచి వేసే విషసంస్కృతి దాపురించింది. సామాన్యుల జీవితాలు దుర్భరమైపోయాయి. సంపద, సౌకర్యాలు, సుఖాలు కొద్దిమందికే పరిమితమయ్యాయి. విజ్ఞానశాస్త్ర ఫలితాలను కొందరే అనుభవించటం ప్రారంభించారు. దీనితో మనిషి మళ్ళీ పునరాలోచనలో పడ్డాడు. పైకి గోచరించేదీ, ప్రత్యక్షంగా మనకు కనిపించేదీ కనికట్టు కావచ్చు, మోసపూరితం కావచ్చు. కాబట్టి 'ఏ విషయమైనా పైకి కనిపించినంతమాత్రాన నమ్మకూడదు. అది హేతుబద్ధమై, తర్కబద్ధమై ఉండాలి ' అనే నిర్ధారణకు వచ్చాడు. 'హేతుబద్ధమైనదే సత్యం' గా ప్రకటించాడు.ఈ ధోరణి వలన సమాజంలోని అతి సామాన్యుడు కూడా పరపీడననుండి విముక్తుడై మేలుపొందాడు. అతి బలహీనుడు కూడా తన ప్రాధాన్యతను గుర్తించి మసలుకోవటం ప్రారంభించాడు.

ఐతే ఈ హేతువాద ధోరణి అంతులేని వాదోపవాదాలకూ, ఎంతకూ కొలిక్కిరాని సిద్ధాంత చర్చలకూ దారితీసింది. ఏకాభిప్రాయనికి తావులేక ఎవరి అభిప్రాయాన్ని వారు సమర్ధించుకునే ధోరణి బయలుదేరింది. మానవుడు కూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలే మహాలక్ష్యాలుగా జీవించాల్సిన పరిస్థితి తల ఎత్తింది. మనిషి ఈ విధంగా దైహిక అవసరాలకే పరిమితమై మానసిక, బౌద్ధిక అవసరాలమాటే తలపెట్టక మనిషిగా తన విశిష్టతనే కొల్పోయే పరిస్థితి దాపురించింది. దీనితో మానవుడు తన హేతువాద దృక్పథాన్ని కూడా విడనాడేందుకు సన్నద్ధుడైనాడు. సరిగా ఇదే నేటి ప్రపంచ దృశ్యం.

సత్యాన్వేషణ పథంలో ఇన్ని శతాబ్దాల మహా యానంలో మానవుడు ఇంకా గమ్యాన్ని చేరలేకపొవటానికి కారణం ఏమిటి....? అని ప్రశ్నించుకోవలసినసమయమిది.

మానవుడికి సత్యస్వరూపం గురించి ఇప్పటివరకూ సరైన అవగాహన లేకపోవటమే దీనికంతటికీ కారణం. సత్యం ఏక రూప విషయం కాదు. అది మూడు అంశల యొక్క సమ్మేళనం.ఏదో ఒకానొక దృక్పథం వలన సంపూర్ణ సత్యం గోచరించదు.మానవుడు సత్యాన్ని చేరలేడు. విశ్వాసం వలన సత్యం లోని ఒక అంశ గోచరిస్తుంది.ప్రత్యక్ష ప్రమాణం లేక ఆధునిక దృక్పథం వలన మరోఅంశ గోచరిస్తుంది. హేతువాద దృక్పథం వలన మరో అంశ గోచరిస్తుంది. ఏదో ఒక దృక్పథాన్నే అంటిపెట్టుకోక సందర్భానుసారంగా మూడురకాల దృక్పథాలనూ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మానవుడు సత్యాన్ని చేరగలడు.

కామెంట్‌లు లేవు: