2, ఏప్రిల్ 2011, శనివారం

శ్రీలంక, భారత్ జట్ల మధ్య సమయము ఆసన్నమైంది

శ్రీలంక, భారత్ జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచుకు ముంబై పూర్తిగా సిద్ధమైంది. రెండు జట్లు కూడా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తాయనడంలో సందేహం లేదు. ఇటు బౌలర్ ముత్తయ్య మురళీథరన్, అటు బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ మోహరిస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా ఇదే ఆఖరి ప్రపంచ కప్ పోటీలు కావడం విశేషం. ఇరు జట్లు కూడా బలంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు జట్లు కూడా మంచి ప్రదర్శనే సాగించాయి. పైకి రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.

రెండింటిని పోల్చి చూస్తే, శ్రీలంక బౌలింగులో, ఇండియా బ్యాటింగులో బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. భారత్‌కు సంబంధించినంత వరకు బ్యాటింగ్ సైడ్ బలంగా ఉంది. సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ముఖ్యంగా యువరాజ్ సింగ్‌లతో భారత బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తుంది. మలింగ, ముత్తయ్య మురళీథరన్, మెండిస్‌లతో శ్రీలంక బౌలింగ్ బలంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు భారత బౌలింగ్ బలహీనంగా కనిపిస్తూ వచ్చింది. అయితే, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో బౌలర్లందరూ ఫలితం సాధించారు. ముఖ్యంగా, శ్రీలంక స్పిన్ బౌలింగ్ బలంగా ఉంది.
భారత, శ్రీలంక ఓపెనింగ్ జంటలు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. భారత ఓపెనర్ సెహ్వాగ్, శ్రీలంక ఓపెనర్ దిల్షాన్‌లది ఒకే తీరైన ఆట. వీరు దూకుడుగా ఆడి స్కోర్లను పరుగులెత్తించగలరు. వారు ఎంత సేపు క్రీజులో నిలబడతారనే దానిపై ఆయన జట్ల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని చెప్పక తప్పదు. అయితే, సెహ్వాగ్‌కు తోడుగా సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్సును ప్రారంభించడం ఇండియాకు కలిసి వచ్చే విషయం.

ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఇప్పటి వరకు ఇన్నింగ్సుకు 274 పరుగుల సగటున 2194 పరగులు చేసింది. శ్రీలంక ఇన్నింగ్సుకు 242 పరగుల సగటున 1933 పరగులు చేసింది. అయితే, భారత్ 58 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 40 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ విషయంలో శ్రీలంకదే పైచేయిగా ఉంది. లోయర్ ఆర్డర్ మాత్రం శ్రీలంక కన్నా భారత్ మెరుగ్గా ఆడినట్లు కనిపిస్తోంది. భారత లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ 304 పరగులు చేయగా, శ్రీలంక బ్యాట్స్‌మెన్ 172 పరుగులు చేశారు. మొత్తంగా చూస్తే, భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: