19, ఏప్రిల్ 2011, మంగళవారం

అవినీతి సమస్య పైన యువతరం స్పందించటం ఆహ్వానించ తగ్గ విషయమే.

అవినీతి సమస్య పైన యువతరం స్పందించటం ఆహ్వానించ తగ్గ విషయమే. ఒక న్యాయమైన సమాజాన్ని కోరుకోవటం సమంజసమే. కానీ ఆచరణలో అవినీతిని ఎలా నిర్మూలిస్తాం? సత్యాగ్రహాలు, దండియాత్రలు, వినతి పత్రాలతో యీ లక్ష్యం నెరవేరుతోందా? లోక్ పాల్ బిల్లు అవినీతికి అడ్డుకట్ట వేస్తుందా? మనం ఒకసారి ఆలోచించాలి. ఏ రాజకీయ వ్యవస్థలోనైనా అధికార వర్గమే చట్టాలు చేస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీలు అవినీతిపరులు, నేరస్థులు, దళారీలతో నిండినప్పుడు, ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి? సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది? అధికారంలో, ప్రతిపక్షం లో వున్న అవినీతిపరులు, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్లే చట్టాన్ని రాసుకుంటారా? ఒకవేళ రాసిన, ఆ చట్టాన్ని ఆచరణలో నిజంగా అమలు చేస్తారా?


అన్నా హజారే నిజాయితీ కలిగిన సామాజిక నాయకుడే, నిబద్దత గలిగిన పెద్ద మనిషే. కానీ నిరాహార దీక్షలు, సంస్కరణ వాదం ద్వారా సమాజం లో మౌలికమైన మార్పు వస్తుందా? అవినీతి అంతం అవుతుందా? కాగితాల మీద ఎంత మంచి చట్టాలు వున్నా, అసమర్ధ నాయకులు వున్నంత కాలం, ఆచరణలో అవి విఫలమవుతునే వుంటాయి. భూసంస్కరణ, ఎన్నికల సంస్కరణలు, రిజర్వరు ఫారెస్టు చట్టాలన్నీ ఆచరణలో విఫలమైనాయి. సమాచార చట్టం వల్ల యిప్పటిదాకా, ఒక వ్యక్తి కూడా శిక్షింపబడలేదు. కానీ సమాచార చట్టం కోసం దరఖాస్తు చేసిన దత్తా పాటిల్ , అమిత్ జత్వా, రామదాస్ గోడ్వాకర్ హత్యకు గురయ్యారు. ఒకవైపు 45 సంవత్సరాలుగా అన్నా హజారే అవినీతి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్నాడు. కానీ దేశంలో అవినీతి వైయ్యి రెట్లు పెరిగింది. 2జీ టెలికాం కుంభకోణంలో కోట్లు దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న మన్ మోహన్, కరుణానిధి, రతన్ టాటా, అనిల్ అంబనీల పైన ఒక కేసు పెట్టలేదు. విచారణ జరపలేదు.

అవినీతి ఆరోపణ ఎదుర్కుంటున్న జగన్ మద్దతుదారుడు గోనె ప్రకాశరావు, చంద్రబాబు ఆస్తులకు బినామీ మురళీమోహన్ లు, ఐయంజీ-భారత్ భూమి కుంభకోణం నిందితుడు చంద్రబాబు, వెయ్యి కోట్లు ఆస్తి వున్న రామ్-దేవ్ బాబా, కోట్లు కొల్లగొట్టిన గాలి జనార్థనరెడ్డి నెత్తికి ఎక్కించుకున్నబిజేపీ-ఏబివీపీ నాయకులు అన్నా హజారే కు జైకొడుతూ, అవినీతి పైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. అంటే ఉద్యమం ఎలా వక్రమార్గాలు పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. దొంగ ఓట్లు, దొంగ సారా, దొంగ నోట్ల తో రాజకీయ దళారులు రాజ్యం మేలుతున్నంత కాలం, ప్రజాస్వామ్యం పతనం అవుతునే వుంటుంది.

క్యాన్సర్ రోగానికి సరైన వైద్యం కావాలి కదా! కుళ్ళిపోయిన వ్యవస్థను కూకటివేళ్ళ తో పెకిలించి, ప్రజాస్వామిక విలువలతో ప్రతిఫలించే నూతన సమాజ నిర్మాణానికి ఉద్యమించాలి. రాజకీయ, ఆర్ధిక, సామాజికమైన మౌళిక మార్పుల కోసం పోరాడాలి. గ్రామాలనుండి పట్టణాల దాకా, ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా నిర్వచించుకొని, ఆచరణ లో పెట్టాలి. అన్నా హజారే ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూనే, అవినీతి లేని వ్యవస్థ కోసం, సామాజిక న్యాయం కోసం, రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలి. అవినీతి నాయకులు, రాజకీయ దళారులను సామాజిక బహిష్కరణ చేయాలి. యీ వ్యవస్థను ఓట్ల రాజకీయాలతో మార్చగలుగుతామా? శాంతియుత మార్గంలో అవినీతి ముష్కరుల మనస్సు కరిగించగలుగుతామా? లేకపోతే ప్రజా పోరాటాలతో సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి

కామెంట్‌లు లేవు: