19, ఏప్రిల్ 2011, మంగళవారం

జగన్‌కు ఆ హీరో దూరమే

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి చాలా దగ్గరగా ఉన్న యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ - జీవిత దంపతులు వైయస్ తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి క్రమంగా దూరం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా రాజశేఖర్ - జీవిత జాడే లేదు. మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి దరి చేరి రాజశేఖర్ దంపతులు వైయస్ మృతి తర్వాత మాత్రం జగన్‌కు మద్దతుగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. ప్రజల కోసం దివంగత వైయస్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాను కాంగ్రెసు పార్టీలో చేరామని చెప్పిన రాజశేఖర్ దంపతులు ఆ తర్వాత పార్టీలో ప్రముఖంగా కనిపించారు. 2007లో చిరంజీవి అభిమానులుగా పేర్కొన్న పలువురు రాజశేఖర్ కారుపై దాడి చేయడంతో వైయస్ - రాజశేఖర్ దంపతుల ఆత్మీయ బంధం మరింత ఎక్కువయింది.


వారు కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత వైయస్‌ను గానీ, జగన్‌ను గానీ, కాంగ్రెసు పార్టీని కానీ ఎవరైనా విమర్శించినా తిప్పి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వైయస్‌పై ఈగ కూడా వాలనీయలేదు. చిరంజీవిపై ఉన్న కోపంతో గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున భారీగానే ప్రచారం చేశారు. కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. చిరంజీవిని లక్ష్యంగా చేసుకొని చాలా ఆరోపణలు చేశారు. ఓ సమయంలో కాంగ్రెసు పార్టీలో జీవితకు ఓ ముఖ్యమైన పదవి వస్తుందనే వాదనలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలో వైయస్ దుర్మరణం చెందారు. అప్పటి నుండి రాజశేఖర్ దంపతుల నుండి ఎలాంటి సందడి లేదు. వైయస్ ఉన్నన్నాళ్లూ చిరంజీవిపై విరుచుకు పడిన, వైయస్‌కు అండగా ఉన్న రాజశేఖర్ దంపతులు ఆయన మరణం తర్వాత మాత్రం జగన్‌కు అంతగా మద్దతు పలికిన దాఖలాలు లేవు.

గతంలో విజయవాడలో జగన్ చేపట్టిన జలదీక్షలో మాత్రమే రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ నాయకుడి ఇంట్లో జరిగిన విందులో కూడా తాము జగన్ వెంటే ఉంటామని కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎక్కడా ఓదార్పులో పాల్గొన్న సందర్భం గానీ, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని సమర్థించినట్టుగా కానీ, కడప ఉప ఎన్నికల ప్రచారంలో కానీ కనిపించింది లేదు. జగన్‌తో ఉంటే ఫలితం లేదనే పునరాలోచనలో వారు పడినట్లుగా తెలుస్తోంది. వైయస్ ఉన్నప్పుడు వీరికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే జగన్ వద్ద తమకు అంతగా ప్రాధాన్యం ఉండదనే ఉద్దేశ్యంతోనే వారు జగన్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. జగన్ పార్టీలో ఇప్పటికే వరంగల్ జిల్లా శాసనసభ్యురాలు కొండా సురేఖ, సినీ నటి రోజా, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అలాంటి ప్రధాన నాయకురాళ్లు ఉన్నప్పుడు జగన్ వెంట వెళ్లినా లాభం లేదనే ఉద్దేశ్యంలో రాజశేఖర్ దంపతులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు వైయస్ బాటలో ఉంటూ కాంగ్రెసు పార్టీలో ఉండాలని ఉన్నప్పుటికి తాను ప్రధానంగా వ్యతిరేకించే చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరటం వారికి మింగుడు పడని విషయం. ఇటు చిరంజీవి రాక కారణంగా ఇటు ఇన్నాళ్లు ఉన్న కాంగ్రెసు పార్టీతో ఉండలేక, అటు పలువురు ఫైర్ బ్రాండ్‌లు వైయస్ తనయుడు జగన్ చుట్టూ ఉండటంతో వారు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు తాము మొదట అడుగిడిగిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపికి బద్ద శత్రువు అయిన కాంగ్రెసులో చిరు ఉండటంతో ఆయనపై నిప్పులు కక్కే అవకాశం వీరికి ఉంటుంది. అంతేకాదు టిడిపిలో అంతగా పేరు బడ్డ మహిళా నేతలు లేక పోవడం కూడా జీవితకు కలిసి వస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు: