మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం నేతలపై యాక్షన్ ప్లాన్‌కు పార్టీ సిద్ధపడుతోంది. పార్టీ అభ్యర్థిగా గెలిచి జగన్ వెంట నడుస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఉద్దేశ్యంతో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప ఉప ఎన్నికలకు ముందే వారిపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఆదివారం ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు బాలనాగి రెడ్డి , ప్రసన్నకుమార్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటు ప్రకటించే అవకాశం ఉంది.
అయితే తాను శాసన సభ్వత్వానికి రాజీనామా చేసినందున దాన్ని ఆమోదించాలని పోచారం పట్టుబడుతున్నారు. ముందుగానే తాము అనర్హత పిటిషన్ వేసినందున దాన్ని తేల్చాలని తెదేపా కోరుతోంది. దీనిపై డిప్యూటీ స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సోమవారం దీనికి సంబంధించి ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆదివారం ఏజితో కూడా కలిసి చర్చించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం కూడా ఫిర్యాదుకు సిద్ధం కావడంతో పెండింగ్ పిటిషన్లపై తుది నిర్ణయానికి డిప్యూటీ స్పీకర్ సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. అనంతరం జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం చేసుకునే చర్యలు ప్రారంభించేందుకు ఉదయుక్తమయినట్టుగా సమాచారం.
ఇందులో భాగంగా తొలిదశలో నలుగురిపై చర్యలు తీసుకోవడానికి పార్టీ అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు, మూడురోజుల్లో కాంగ్రెస్ శాసనసభా పక్షం ఈ మేరకు నాదెండ్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కడప జిల్లా ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖపై తొలిసారి ఫిర్యాదు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కడప ఉప ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్‌కు బహిరంగంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. వీరితోపాటు కోస్తాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా అనర్హత వేటు జాబితాలో చేరవచ్చునని పార్టీ వర్గాలంటున్నాయి.
దివంగత వైఎస్ మరణానంతరం రోశయ్య మంత్రివర్గంలో తాను కొనసాగలేనంటూ కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పట్లోనే ఆమె పార్టీపై, రోశయ్యపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి నేరుగా లేఖ రాసి కలకలం సృష్టించారు. వీలైనప్పుడల్లా కాంగ్రెసుపై ధ్వజమెత్తింది. అధిష్టాన్ని ప్రశ్నించింది. వీరితో పాటు జగన్‌తో వెళుతున్న మరికొందరు ఎమ్మెల్యేలపై పార్టీ నేతలంతా చాలా కాలంగా సీరియస్‌గా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు గట్టిగా పార్టీని డిమాండ్ చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్‌కు అసెంబ్లీలో స్వల్ప ఆధిక్యం ఉండడం కారణంగా ఇన్నాళ్లు వేచి చూసే ధోరణిలో వెళ్లింది. 18 మంది ఎమ్మెల్యేలున్న ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు పలకడం, ఆ తరువాత కాంగ్రెస్‌లోనే విలీనమయ్యేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్ వైఖరిలో మార్పు వచ్చింది. కడప ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల తీరును పరిశీలించాక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అధిష్ఠానం నాలుగురోజుల కిత్రం ఢిల్లీలో ఈ విషయంపైనే కీలక చర్చలు జరిపింది. ఆ మేరకే ఇప్పుడు అనర్హత ఫిర్యాదుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిప్యూటీ స్పీకర్ వద్ద విచారణలో ఉన్నాయి.
ఇక కాంగ్రెసు పార్టీ కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం అనర్హత వేటుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని భావిస్తోంది. ఎన్నికైన పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు కార్యకలాపాలు సాగిస్తే స్వచ్ఛందంగా తమ పదవిని వదులకున్నట్లుగా భావించవచ్చనే విధంగా చట్టంలో ఉందని పార్టీ నేతలంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికైన పార్టీని విమర్శిస్తూ, వేరే పార్టీ వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యేలను స్పీకర్లు అనర్హత వేటు వేసిన సందర్భాలను ఉదహరిస్తున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి