19, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీ భగవాన్ సత్యసాయి అధ్యక్షుడిగా ఉన్న సత్యసాయి ట్రస్టు ఆస్తులు రూ.1.30 లక్షల కోట్లు అని ఆ ఆస్తుల కోసం ఆయన చుట్టూ చేరిన వారు పలువురు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయడం కోసం బాబా నిర్మించిన భక్తి సామ్రాజ్యంలో దొంగలు పడి నిలువుగా దోచుకుంటునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఆదివారం ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. పుట్టపర్తి అంటే భగవాన్ సత్యసాయి బాబా, ఆయన భక్తులు మాత్రమే కాదు! ఇదో విశాల సామ్రాజ్యం! దేశ దేశాల్లో ఉన్న ట్రస్టు స్థిరాస్తులతోపాటు ప్రశాంతి నిలయంలో ఉన్న కోట్లలో నగదు, టన్నుల్లో బంగారం, వజ్ర వైఢూర్యాల విలువ లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా! ఇది సాయిబాబాను సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా నమ్మి, నివేదించుకున్న భక్తి సంపద. ఇలా భక్తులు సమర్పించుకున్న దానిలో కొంతమాత్రమే ట్రస్టు ఖాతాలో పడుతోంది! మిగిలింది, ట్రస్టులోని కొందరు సభ్యుల సొంత ఖాతాల్లో జమ అవుతోంది. బాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత ఈ డబ్బును అత్యంత రహస్యంగా, పకడ్బందీ భద్రత మధ్య తరలించే కార్యక్రమం మొదలైంది.


ప్రశాంతి నిలయానికి సమీపంలో ఉండే ఐటీ కోర్ బిల్డింగ్ నుంచే ఈ వ్యవహారం నడుస్తోంది. ఒకవైపు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వేదికగా భగవాన్ సత్యసాయి ఆరోగ్యంతో ఆడుకుంటూ... మరోవైపు ఐటీకోర్ బిల్డింగ్ కేంద్రంగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. ఇక్కడ కొద్ది రోజులుగా హడావుడి పెరిగింది. కంప్యూటర్ల కీ బోర్డులు టకటకలాడుతున్నాయి. సుమారు 165 దేశాల్లోని పలువురు వ్యక్తుల ఖాతాల్లో ఆన్‌లైన్ మార్గంలో డబ్బులు పడిపోతున్నాయి. ఈ బిల్డింగ్ శత్రు దుర్బేధ్యం. నల్లధనమైనా, తెల్లధనమైనా, హవాలా అయినా, ఏ దేశ కరెన్సీ అయినా ఇక్కడి నుంచి క్షణాల్లో ఆన్‌లైన్‌లో సర్దుబాట్లు జరిగిపోతుంటాయి. గత నెల 28న బాబా ఆస్పత్రి పాలయ్యాక ఐటీ కోర్ బిల్డింగ్‌ను దోపిడీ సూత్రధారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నమ్మిన బంట్ల ద్వారా వాటాలు సెటిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దోపిడీకి గురవుతున్నది, సెటిల్‌మెంట్లు జరుగుతున్నది భక్తులు కానుకగా సమర్పించుకున్న సంపదే కాదు! ఎందరో ప్రముఖులు దాచుకున్న నల్ల డబ్బు కూడా!

ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. పోలీసులు, ఆదాయపు పన్ను, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులెవరూ ప్రశాంతి నిలయం వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. దీంతో ట్రస్టులోని కొందరు వ్యక్తులు ప్రశాంతి నిలయాన్ని ఒక హవాలా కేంద్రంగా మార్చారనే ఆరోపణలున్నాయి. బడా బడా వ్యక్తులు, ప్రముఖులు తమ నల్లధనాన్ని దాచుకునేందుకు పుట్టపర్తిని అత్యంత సురక్షితమైన స్థలంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల నగదు దాచుకోవడం... అవసరమైనప్పుడు తీసుకోవడం... ఇదో హవాలా బజార్! పుట్టపర్తి వ్యవహారాలను చాలా ఏళ్లపాటు దగ్గరుండి పరిశీలించిన ఒక పోలీసు అధికారి మాటల్లో చెప్పాలంటే... 'ఇది ఒక మినీ స్విస్ బ్యాంక్'. కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు ఇక్కడ 'ఖాతాలు' తెరిచినట్లు విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్రకు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ 2 వేల కోట్లు దాచుకున్నట్లు సమాచారం.

బాబా అస్వస్థతకు గురి కాగానే ఆ నాయకుడు పరిగెత్తుకుంటూ పుట్టపర్తికి వచ్చారు. అలాగే... మహారాష్ట్రకే చెందిన ఓ మాజీ మంత్రి పుట్టపర్తిలో మరో వెయ్యి కోట్లు పెట్టినట్లు చెబుతున్నారు. సత్యసాయికి సంబంధించిన ధార్మిక వ్యవహారాలు చూడాల్సిన ట్రస్టులోని కొందరు సభ్యులే... ఈ 'నల్ల' కార్యక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ రహస్య లావాదేవీలన్నింటినీ చక్కదిద్దేందుకు ప్రణాళికలు రచించి, దానిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని పెద్దల్ని, కొందరు అధికారుల్ని ముందుగానే మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు నడుస్తున్నది... సూత్రధారుల మధ్య పంపకం!

కామెంట్‌లు లేవు: