కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ సత్యసాయిబాబా మరణాన్ని భారతీయ జనతా పార్టీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో, దేశంలోనే కాకుండా సత్యసాయికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపించలేని బిజెపి ఎప్పటి నుండో రాష్ట్రంలో ఓ వెలుగు వెలగాలనే ఆశతో ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత బిజెపి బలోపేతానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రెండంకెల అసెంబ్లీ సీట్లను గెలవాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే కిషన్‌రెడ్డి అధ్యక్షుడు అయ్యాక జిల్లాల పర్యటనకు వెళుతూ ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. పుట్టపర్తిలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బిజెపి రాష్ట్రంలో పట్టు సాధించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
సత్యసాయి సేవలు, ఆధ్యాత్మికత ద్వారా పుట్టపర్తి ప్రపంచ వ్యాప్తమైందని, అలాంటి పుట్టపర్తి ఉన్న జిల్లాను సత్యసాయి జిల్లాగా పేరు మార్చాలనే డిమాండును ప్రభుత్వం ముందు ఉంచాలని బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షించవచ్చునని బిజెపి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సత్యసాయి మతాలకతీతంగా ఆధ్యాత్మికతను నెలకొల్పారు. కాబట్టి సత్యసాయి జిల్లాకోసం డిమాండు తీసుకు వస్తే అందరూ తమకు మద్దతు పలికే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాహార్తిని తీర్చిన ప్రదాతగా సాయిని అందరూ ప్రశంసిస్తారు. ఇప్పుడ అక్కడకు వచ్చే లక్షలాది భక్తుల దృష్టిని బిజెపి వైపు మరల్చేందుకు పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సాయి మరణంతో వెనుక పడ్డ పుట్టపర్తి నుండి రాష్ట్రంలో తమ ప్రస్తానం ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, మాజీ ఉప ప్రధాని అద్వానీలు వచ్చారు, వస్తున్నారు. ఇక రాష్ట్రం అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయలతో పాటు పలువురు నేతలు పుట్టపర్తిలో బస చేయనున్నారు. దక్షిణాదిన కర్ణాటకలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కర్ణాటక స్ఫూర్తిగా రాష్ట్రంలో కూడా ఆ దిశగా పయనించేందుకు బిజెపి ఉత్సాహ పడుతోంది. బిజెపి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అనంతపురం జిల్లా అనుకొని ఉంటుంది. దీంతో మొదట జిల్లాలో పాగా వేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
కర్ణాటక మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి అనంతపురంలో గనుల వ్యాపారం కూడా ఉంది. ఇక గాలి జనార్థన్ రెడ్డికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్న కారణంగా జగన్‌ను పార్టీలోకి తీసుకు వచ్చి బలోపేతం కావాలని భావిస్తోంది. అయితే జగన్ వచ్చినా రాకున్నా కర్ణాటక స్ఫూర్తిగా అనంతపురం జిల్లానుండి పార్టీ బలోపేతం మాత్రం చేయాలని భావిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి