మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ సీటును గెలుచుకోవడానికి వ్యూహాలు చేస్తున్నారు. గత ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబం వైపే నిలబడిన కడప, పులివెందుల ప్రజలు ఇప్పుడు వైయస్ మరణం తర్వాత నిలువునా కుటుంబం చీలడంతో ఎటువైపు ఉంటారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వివేకానందరెడ్డికి స్థానికంగా ఉన్న పట్టు దృష్ట్యా ఆయన వైపే ప్రజలు ఉంటారని కొందరు చెబుతుండగా, వైయస్ ఇమేజ్ దృష్ట్యా జగన్ వైపే ఉంటారని మరికొందరి వాదన.
ఈ ఎన్నికల ద్వారా జగన్ కాంగ్రెసు వైపు కాకుండా వైయస్ వైపు ఉన్నారని చెప్పడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు కడప పార్లమెంటు స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన వర్గం నేతలతో శనివారం భేటీ అయ్యారు. ఎన్నికలలో వ్యూహాలపై వారితో చర్చించారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇక తన వంతుగా తల్లిని పులివెందుల స్థానం నుండి గెలిపించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా చేయించుకున్న ప్రచార రథంలో మంగళవారం నుండి ప్రచారం ప్రారంభించనున్నారు. సోమవారం ఉగాది పండుగ ఉన్నందున 6వ తారీఖు నుండి 30 తారీఖు వరకు జగన్ పర్యటన ఖరారు చేశారు. ఇందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. 25 రోజుల పాటు సాగే ఈ ప్రచార పర్యటనలో జగన్ కడప నుండి తాను గెలవడానికి ఒక్కో నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించనున్నారు.
ఇక తల్లి విజయమ్మ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి ఆమెను గెలిపించడానికి ఏకంగా 7 రోజులు అక్కడ పర్యటించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా జిల్లా ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పడమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించుకోనున్నారు. జగన్ తన పర్యటనను జమ్మలమడుగు నుండి ప్రారంభించనున్నారు. అయితే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెసుకు ఏకపక్షంగా ఉన్న కడప, పులివెందులు ఆ కుటుంబం నిలువునా చీలడం వలన టిడిపి లాభపడుతుందా లేదా వైయస్ కుటుంబం నిలుపుకుంటుందా, కాంగ్రెస్ పట్టు సాధించుకుంటుందా చూడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
" గత ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబం వైపే నిలబడిన కడప,"
పై వ్యాక్యం కరెక్ట్ కాదేమో అనుకుంటాను మిత్రమా..!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి