రెండున్నర ఏళ్ల రీళ్ళను
వెనక్కు తిప్పితే
వెంకన్న సాక్షిగా
ఆయన పాదాల చెంత
సామాజిక న్యాయం
ప్రజా రాజ్యం తో సాధ్యం అని పొలికేక పెట్టే డైలాగుతో
షాట్ మొదలయ్యింది
అందరూ అంచనా వేసినట్టే
హీరో అవినీతి సామ్రాట్టులకు మళ్ళీ
అధికారం అందించడంలో
విజేతగా నిలిచే సన్నివేశాలు చిత్రీకరించి
ఇక జెండా పీకేద్దాం అని గుస గుసలు పోయినప్పుడు
గుస్సా అయి అంతెత్తున లేచి
జనం గుండెల్లో నుండి తీసేసేదెవరు అని
తీక్షణంగా ప్రశ్నించే సన్నివేశాన్ని బాగా పండించి
మరో షాట్ లో
నేనే పోయినా
పార్టీ ఉంటుందని ఉద్ఘాటించే సన్నివేశంలో
ఉద్విగ్నత ను చూపి
నూట ఏభయ్యో సినిమా కథ కోసం
వెతుకుతున్నానంటూ
అభిమానులకు ఎన్నో ఆశలు కల్పించే
మరో సన్నివేశంతో
కథలో కీలక మలుపు తిప్పి
రెండున్నర ఏళ్ల రీళ్లకు
హస్తినలో దహన సంస్కారాలు చేసే సన్నివేశంతో
షాటు మొదలెట్టి
దానికి దర్శకురాలిగా
విదేశీ పరిజ్ఞానంతో
స్వదేశీలో రెచ్చిపోతున్న
సోనియా గాంధీని ఎన్నుకొని
కొత్త సినిమాను మొదలెట్టాడు
ఆంటోనీ కథా చర్చలు గావిస్తే
పటేల్ రాసిన మాటలతో
మొయిలీ క్లాప్ తో
రెండున్నర ఏళ్ళు తీసి తగలెట్టిన రీళ్ళలోని
పాపులర్ డైలాగు ‘సామాజిక న్యాయాన్ని సాధించడానికి’ అంటూ
హీరో కొత్తగా చెప్పడాన్ని
డీ ఎస్ కిరణ్ కేరింతల మధ్య
దర్శకురాలి దగ్గర చాన్స్ రాని
మరో హీరో ఫ్యాన్సు కుత కుతల మధ్య
అద్బుతంగా ప్రారంభమయ్యింది