మొబైల్‌ఫోన్ లేకపోతే ఏమవుతుంది..? ఒక్కసారి ఆలోచించండి.. అమ్మో ప్రపంచం ఆగిపోతుంది అంటారా..? కావచ్చు.. సెల్ చేతిలో లేకపోతే ఒక్కక్షణం కూడా మనకు తోచదు. రోజులో ఒక్కకాల్ అయినా రాకపోతే.. మనసు విలవిలలాడిపోతుంది. ఆదిలాబాద్‌లో ఉన్నవాడిని.. అనకాపల్లిలో ఉన్నవాడిని.. అమెరికాలో ఉన్నవాడినీ ఒక్క క్షణంలో కలిపేశక్తి మొబైల్ సొంతం. కానీ.. అదే సెల్‌ఫోన్.. ఇప్పుడు మన పాలిట పిశాచిలా మారింది. మన ప్రాణాన్ని బలితీసుకోబోతోంది.
మన చేతిలో... మన జేబులో.. మన ఇంట్లో.. చివరకు మన జీవితంలో.. ప్రతీ చోటా బాంబ్... ఒకరూ ఇద్దరూ కాదు... దేశంలో 70 కోట్లమంది మృత్యువును చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు.. మీ చేతిలో బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చు.. ఎవరి ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు.. ఎలాగైనా పోవచ్చు.. ఆ బాంబే.. సెల్‌ఫోన్. మన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నమహమ్మారి. మన ప్రాణాన్ని కబలించడానికి సెల్ చురుగ్గా పావులు కదుపుతోంది. అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్‌ను కలిగిస్తోంది సెల్‌ఫోన్. సాధారణ వ్యక్తులతో పోల్చితే.. సెల్ వాడుతున్నవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 400 శాతం ఎక్కువట. దీన్ని బట్టి.. మీ చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి..
ఈ విషయాన్ని ఏదో అల్లాటప్పా సర్వే తేల్చింది కాదు.. పిచ్చిసర్వే చెప్పింది అంతకన్నా కాదు.. మన కేంద్ర ప్రభుత్వం తేల్చిన విషయం. సెల్‌ఫోన్ రేడియేషన్ ఎఫెక్ట్‌పై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం నిజానిజాలను వెలికి తీయడానికి, ఎనిమిదిమంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మెంబర్ సెక్రటరీ, డీఓటీ నుంచి సభ్యులను ఈ కమిటీలో నియమించింది. సెల్‌ఫోన్ వినియోగంపై విస్తృతంగా పరిశోధించిన ఈ కమిటీ.. సెల్‌ఫోన్ రేడియేషన్‌కు సంబంధించి భయంకరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. అందులో కీలకమైన విషయమే.. బ్రెయిన్ క్యాన్సర్ ఎఫెక్ట్. అందుకే.. సెల్‌ఫోన్ రేడియేషన్‌పై ఇంత ఆందోళన. బ్రెయిన్ క్యాన్సర్‌ను 400 శాతం పెంచుతుందంటే.. సెల్‌ఫోన్ తెచ్చిపెట్టే ముప్పును ఊహించవచ్చు.
క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. బ్రెయిన్ క్యాన్సర్ కూడా అంతే. ఎర్లీస్టేజ్‌లో గుర్తించకపోతే.. ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మెదడులో కణుతులు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సెల్ వాడకం ఎక్కువైతే.. బ్రెయిన్‌లో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే.. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని ఎన్నో పరిశోధనలు కూడా చెప్పాయి. ఇది వాస్తవమా.. కాదా అన్నది తేల్చడానికే ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏకంగా 400 శాతం ఎక్కువని తేలడంతో.. సెల్ వినియోగంపై అంతా దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. సెల్లే కదా అని ఈ విషయాన్ని సిల్లీగా తీసుకుంటే మాత్రం.. మీ లైఫ్‌కు గ్యారెంటీ ఉండదు. సెల్ వినియోగదారులూ... తస్మాత్ జాగ్రత్త.
ఎన్నో సమస్యలు
రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా...? ఎంత ట్రై చేసినా కళ్లు మూతపడడం లేదా..? మనిషి జీవితంలో నిద్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉదయమంతా అలసిపోయిన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకొని, కొత్త శక్తిని సంపాదించుకొనేది నిద్రపోయే సమయంలోనే. కానీ.. ఎంతో అవసరమైన ఈ నిద్రే ఇప్పుడు చాలామందికి సమస్య. నిద్రలేమితో రాత్రుళ్లు నెట్టుకొస్తున్నవాళ్లు ఎంతోమంది. అర్థరాత్రి దాటినా వారికి కునుకుపట్టదు.. ఫలితం.. పగలు పూర్తిస్థాయిలో పనిచేయలేరు. అంతా చికాకుగా ఉంటుంది.
దీనికి కారణం.. సెల్‌ఫోన్ వాడకం. నిద్రలేమితో బాధపడుతున్నవారిలో నూటికి డెబ్బై శాతం మంది సెల్‌బాధితులే. మొబైల్‌లో కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మర్చిపోయేవారినే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. బెడ్ ఎక్కిన తర్వాత సెల్‌ను వాడుతూనే ఉంటారు. ఇలాంటి వారికేసరిగ్గా నిద్రపట్టడం లేదని కేంద్రం నియమించిన కమిటీ తన రిపోర్ట్‌లో పేర్కొంది..
సెల్‌ఎక్కువగా వాడితే వచ్చే మరో సమస్య తలనొప్పి. మొబైల్‌ను విపరీతంగా వాడేవారిలో తరచూ కనిపించే సమస్య ఇది. సెల్‌ఫోన్ కారణంగా తలలో జరిగే మార్పులే దీనికి కారణం. మొబైల్ ఫోన్‌ను చెవికి అతికించేసుకుని మాట్లాడేవారూ మనమధ్య తరచూ కనిపిస్తుంటారు. వారికి సెల్లే లోకం. అలాంటి వారిని చెవి సమస్యలు చుట్టుముడతాయి. చెవిలో ఏవో శబ్దాలు మారుమోగుతున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా వినికిడిశక్తి తగ్గిపోతుంది. నాలుగేళ్లకన్నా ఎక్కువకాలం సెల్‌ఫోన్ వాడుతున్నవారిలో చెవి సంబంధ వ్యాధులు ఎక్కువగా బయటపడుతున్నట్లు ఎన్నో పరిశోధనల్లో తేలింది.
సెల్‌తో మాటలు కలుస్తున్నాయేమో గానీ, మనశ్సాంతి మాత్రం కరువవుతోంది. సెల్‌వాడకంతో ఒత్తిడి పెరుగుతుంది. సెల్‌ఫోన్ రేడియేషన్‌పై ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. ఏకాగ్రత తగ్గిపోవడం, విసుగు, అరుగుదల లోపించడం, చర్మ సంబంధిత వ్యాధులు రావడం, శరీరంపై ట్యూమర్లు రావడం, మగతగా ఉండడం.. మతిమరుపు పెరగడం లాంటి ఎన్నో సమస్యలు సెల్‌కారణంగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలోనూ కనిపిస్తే.. మీరు చేయాల్సిందల్లా.. వేలాదిరూపాయలు పోసి ట్రీట్‌మెట్ తీసుకోవడం కాదు... సింపుల్‌గా సెల్‌ను పక్కన పెట్టేయడం.
మగాళ్లకూ ముప్పే
సెల్‌ఫోన్‌తో మగాళ్లకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. ప్యాంట్ జేబుల్లో సెల్ పెట్టుకుంటే ప్రమాదంలో పడ్డట్లే అని హెచ్చరిస్తున్నారు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు. సంతానోత్పత్తికి కీలకమైన వీర్యకణాల సంఖ్య ఈ సెల్‌ఫోన్ వల్ల తగ్గిపోతున్నాయన్నది జెఎన్‌యూ పరిశోధకులు తేల్చిన విషయం.
మగ ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాన్ని జెఎన్‌యూ స్కాలర్స్ కనిపెట్టారు. సెల్‌ఫోన్ వెలువరిచే రేడియేషన్‌కు ఈ ఎలుకలను గురిచేసినప్పుడు వాటిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా స్పెర్మ్ సెల్స్‌లోని డీఎన్‌ఏ విచ్చిన్నం కావడాన్ని వీరు గుర్తించారు. దీని వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నది వారి అంచనా. ఇదే ఎఫెక్ట్ మనుషులపైనా ఉంటుందని జెఎన్‌యూ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, సెల్ వినియోగించేవిషయంలో మగాళ్లు చాలా జాగ్ర్తత్తగా ఉండాలంటున్నారు. వీలైనంతవరకూ ప్యాంట్ జేబులో సెల్ పెట్టుకోకూడదంటున్నారు..
పిల్లలకు ఫోనొద్దు
మహిళలకూ సెల్‌తో ప్రమాదమే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరీ ప్రమాదం. గర్భం దాల్చిన తర్వాత ఫోన్‌ను ఎక్కువగా వాడితే.. కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. కొన్ని అవయవాలు సరిగా ఎదకపోవచ్చు. ఇక చిన్నపిల్లలను మొబైల్‌ఫోన్‌కు వీలైనంత దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎదిగే వయస్సులో మొబైల్ వాడడం వల్ల రేడియేషన్ ప్రభావం వారిపై చాలా ఎక్కువగా పడుతుంది.
మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు.. సెల్ టవర్లు మరీ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని నిమిషాలు గంటలు మాత్రమే వినియోగించే ఫోన్ వల్లే ఇన్ని సమస్యలున్నప్పుడు.. 24గంటలూ రేడియేషన్‌ను వెలువరిచే సెల్‌టవర్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. టవర్‌కు సమీపంలో ఉండేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని ఎన్నో రిపోర్ట్స్‌లో బయటపడింది. ఈ ప్రాంతాల్లో ఉండేవారికి చర్మసంబంధ వ్యాధులూ ఎక్కువగా వస్తాయి. ఏవైనా వ్యాధులు వస్తే.. అవి తగ్గడమూ చాలా ఆలస్యమవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా.. సెల్‌ద్వారా.. సెల్ టవర్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడాల్సిందే.
శరీరం ఛిద్రం
అమెరికా నుంచి ఫోన్ చేసినా.. అరక్షణంలోనే మనకు ఫోన్ వచ్సేస్తుంది. మనం మాట్లాడేది వెంటనే అవతలివైపు చేరిపోతుంది. ఇంత వేగంగా ఎలా వెళ్లగలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? దానికి కారణం.. సెల్ సిగ్నల్స్ వెళ్లే వేగమే.. సెకనుకు లక్షమైళ్ల వేగంతో ఈ సిగ్నల్ పాస్ అవుతుంటాయి. ఇదే రేడియేషన్. గామారేస్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఆల్ఫా ఆర్టికల్స్ లాంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కలగలిసి... దూసుకుపోతుంటాయి. మన శరీరాల్లోనుంచి కూడా ఇవి చొచ్చుకుపోతాయి. అంతవేగంతో ఇవి ప్రయాణిస్తూ.. మన శరీరంలోని కణాలను అవి ఢీకొడితే.. ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించండి... అందుకే శరీరంలో కణజాలం దెబ్బతింటుంది.
మనం ఉపయోగించే ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరమూ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్, రేడియో, సెల్‌ఫోన్, టెలివిజన్ ఇలా ప్రతీదీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్‌ను విడుదల చేయవడం వల్లే అవి మనకు ఉపయోగపడుతున్నాయి. ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్‌లో ఈ రేడియేషన్ పాస్ అవుతుంది.
సెల్‌ఫోన్‌ను వాడుతున్నప్పుడు కూడా... ఈ రేడియేషన్ ఎక్కువగా విడుదల అవుతుంది. మొబైల్‌ను మనం చెవికి ఆనించి ఉంచుతాం కాబట్టి.. ఆ రేడియేషన్ ఎఫెక్ట్.. మన తలపై ఎక్కువగా పడుతుంది. దాని కారణంగా మెదడులో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. సున్నితమైన మెదడు.. ఈ రేడియేషన్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.
రేడియేషన్ కారణంగా మన శరీరంలోని రక్త కణాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్నదానిపై పరిశోధన జరిగింది.రేడియేషన్ లేనప్పుడు.. రక్తకణాలు విడివిడిగా ఉంటాయి. అదే లో రేడియేషన్‌కు గురిచేసినప్పుడు ఈ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. కొన్ని విడిగా ఉన్నాయి. అదే కంప్యూటర్ ముందు గంటకు పైగా గడిపినప్పుడు ఈ రక్తకణాలు మరికాస్త దగ్గరకు జరిగాయి. అదే పది నిమిషాల పాటే సెల్‌పోన్‌లో మాట్లాడితే ఆ రక్తకణాలు కుచించుకుపోయాయి. ఈ తరహా రక్తకణాల అమరిక.. సాధారణంగా క్యాన్సర్ పేషెంట్లలోనే కనిపిస్తుంటుంది. అందుకే.. సెల్ వాడుతున్నవారికి క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువవుతున్నాయి.
తస్మాత్ జాగ్రత్త!
మీ సెల్ మీకు హెల్ చూపించకూడదనుకుంటే.. మొదటి అడుగు నుంచే జాగ్రత్త పడాలి. సెల్‌ఫోన్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొబైల్.. రేడియేషన్ ఎంత విడుదల చేస్తుందన్నవిషయాన్ని ప్రతీ కంపెనీ తప్పనిసరిగా మ్యాన్యువల్‌లో పేర్కొనాలి. దీన్నే స్పెసిఫిక్ అబ్సార్పషన్ రేట్.. SAR అంటారు. మన దేశంలో దీని మాగ్జిమమ్ లిమిట్ 2 వాట్ పర్ కేజీ. ఓ రకంగా ఇది కూడా ప్రమాదకరమైన స్థాయే. SAR వాల్యూ 2 వాట్ ఉంటే హైరేడియేషన్‌ను ఆ ఫోన్ వెలువరుస్తుందని అర్థం. అందుకే... అంతకన్నా తక్కువగా ఉన్న ఫోన్లలో కొనుగోలు చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ SAR విలువపై కీలకమైన సలహాను ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 2 వాట్‌ను.. 1.6 వాట్‌కు తగ్గించాలని సూచించింది. ఇక రేడియేషన్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అందులో ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న చోట నుంచి మొబైల్ టవర్లను తొలగించడంతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయకూడదని సూచించింది. సెల్ వినియోగం పెరగడంపైనా ఆ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సెల్ వాడుతున్నవారు.. అత్యవసరానికి మాత్రమే ఫోన్‌ను వాడాలే తప్ప.. అనవసరంగా వాడితే ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.
ఇప్పటికే దేశంలో దాదాపు మూడున్నర లక్షల సెల్‌టవర్లు ఉన్నట్లు అంచనా. ప్రతీ కంపెనీ దేనికదే సెల్‌టవర్లను ఏర్పాటు చేసుకొంటోంది. అయినా.. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ సిగ్నల్స్ అందవు. అందుకే.. టవర్ల సంఖ్య పెరగుతూనే ఉంది. పైగా కొత్త కంపెనీలు రావడంతో ఈ టవర్లు విచ్చలవిడిగా జనం మధ్య కొలువుతీరవచ్చు. అంటే ఓ రకంగా మరింత రేడియేషన్ మనపై దాడిచేయబోతుందన్నమాట. ఈ విషయంలోనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్ని కంపెనీలు ఒకేటవర్‌ను వాడుకునేలా నిబంధనలు మార్చాలి. అప్పుడు రేడియేషన్ ప్రభావం కాస్త తగ్గొచ్చు. అంతే తప్ప.. జనం మధ్య టవర్లే లేకుండా చేస్తే.. సెల్ మూగబోతుంది. జనానికి పిచ్చెక్కుతుంది.
మొబైల్ వాడే వారూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా ఫోన్‌ను చెవికి ఆనించడం కన్నా, ఇయర్ ఫోన్స్ వాడడం మేలు. కాల్ చేసేటప్పుడు శరీరానికి కనీసం ఒక ఇంచ్ దూరంలో ఫోన్‌ను పెట్టడం వల్ల రేడియేషన్ నేరుగా శరీరంలోకి చొచ్చుకుపోదు. ఒకవేళ ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. చెవి వేడెక్కితే వెంటనే కాల్‌ను ఎండ్ చేయాలి. వీలైనంతవరకూ తక్కువ మాట్లాడడం వల్ల రేడియేషన్‌కు గురికాకుండా ఉండొచ్చు.