29, ఏప్రిల్ 2011, శుక్రవారం

జగన్ బిజెపి ??

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా మద్దతు ఇస్తుందనే వాదనలు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ఇటు జగన్, అటు బిజెపి తమ అంతర్గత మద్దతు విషయంపై ఖండించినప్పటికీ దానిని ఎవరూ నమ్మె స్థితిలో కనిపించడం లేదు. అందుకు పలు కారణాలు మనకు కనిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ పార్టీ నేతలు చేస్తున్న కాంగ్రెసు, టిడిపి కలిసి పోయాయన్న మాటలు కూడా ఎవరూ నమ్మినట్లుగా కనిపించడం లేదు. కేవలం ఉప ఎన్నికలలో ఆ రెండు పార్టీలు కలిసి పోయాయని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. ఇటు తండ్రి మరణించడం, కాంగ్రెసు పార్టీ నుండి బయటకు రావడం వంటి పలు సానుభూతిలతో పాటు కాంగ్రెసు, టిడిపి కలిసి పోయాయని చెబితే తనకు మరింత సానుభూతి వస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఆ పార్టీలపై ఆరోపణలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో జగన్, బిజెపి అంతర్గత మద్దతు తెరపైకి రావడంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.


రెండు నెలల క్రితమే జగన్ బిజెపి జాతీయ నేతలను కలిసినట్లుగా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెసు, టిడిపి పార్టీ నేతలే కాకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా బిజెపి జాతీయ నాయకులను జగన్ రెండు నెలల క్రితం కలిశారని శుక్రవారం కడపలో చెప్పారు. బిజెపి నేతలతో కలిసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని జగన్ సమర్థవంతంగా తిప్పి కొట్టలేక పోతున్నారు. దీంతో జగన్ ఆ నాయకులను కలిసినట్లుగా స్పష్టమవుతోందని కొందరు భావిస్తున్నారు. బిజెపితో కలవడం అనే విషయంపై జగన్ మరో తప్పిదం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. బిజెపితో కలవనే కలవనని చెబుతూ ఒకవేళ కలిస్తే కనుక ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌లు కోరతానని చెప్పారు. దానిపై వెంటనే వివాదం చెలరేగడంతో సాయంత్రానికి మాట మార్చారు. తాను అలాంటి వ్యాఖ్యలే చేయలేదని చెప్పారు. ఆ తర్వాత శుక్రవారం జగన్‌కు చెందిన సాక్షి పత్రికలోనే జగన్ తాను బిజెపితో కలవనని చెప్పడానికే ఆ వ్యాఖ్యల చేశారంటూ వార్తను ప్రచురించారు. అంటే ఏది నిజం. ఇలాంటి అస్పష్ట వ్యాఖ్యల ద్వారా బిజెపితో అంతర్గతంగా పొత్తు కుదిరిందని చెప్పకనే చెప్పారు.

ఇక కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో జగన్ సంబంధాలు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పార్టీలు వేరైనప్పటికీ గతంలో కూడా ఇరువురు కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి. సాక్షాత్తూ కాంగ్రెసు నేత అయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కర్ణాటకలో గాలి తరఫున బిజెపికి ఓటు వేయాలని ప్రచారం చేసినట్టు అప్పట్లో వివాదం చెలరేగింది. ఇప్పుడు కూడా జగన్ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా భారీ ఆధిక్యంతో గెలుస్తాడని గాలి ఇటీవల అన్నట్లుగా తెలుస్తోంది. ఇక జగన్ సంగతి ఇలా ఉంటే బిజెపి కూడా జగన్‌కు మద్దతు పలుకుతుందని చెప్పడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బిజెపి - జగన్ మద్దతుపై పిసిసి చీఫ్ డిఎస్ వ్యాఖ్యలు చేస్తే జగన్ కంటే ముందుగానే బిజెపి స్పందించడం గమనార్హం. తమ మధ్య అవగాహన లేదని చెప్పడం కంటే ముందుగా తమను మైనార్టీ వ్యతిరేకులుగా పేర్కొన్న దానికి సమాధానం చెప్పాలి. కానీ బిజెపి తమను మైనార్టీ వ్యతిరేకులుగా చూపిస్తున్నారనే వ్యాఖ్యలపై స్పందించకుండా జగన్‌తో సంబంధాలు లేవని చెప్పడానికే ప్రాధాన్యత ఇవ్వడం ఎంత విడ్డూరం. తమను మైనార్టీ వ్యతిరేకులుకు సృష్టిస్తున్న వారిపై విరుచుకు పడకుండా జగన్‌తో సంబంధాలు లేవని చెప్పి ఆయనకు అంతర్గత మద్దతు ఉందని చెప్పకనే చెప్పినట్టుగా పలువురు భావిస్తున్నారు.

ఇక మరో విషయం ఉప ఎన్నికలలో అభ్యర్థిని బరిలో నిలపక పోవడం, అందుకు బలం లేదని కారణం చెప్పడం మరింత విచారకరం. గత సాధారణ ఎన్నికల్లో తమకు బలం లేదనే విషయం బిజెపికి తెలియదా. మరి అప్పుడు కడప పార్లమెంటు నుండి ఎందుకు పోటీ చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కడపలో వైయస్‌ను తట్టుకోవడానికి హేమాహేమీలైన పార్టీలో ఆలోచిస్తున్న సమయంలో బిజెపి 2009లో కడప నుండి అభ్యర్థిగా బరిలో దింపిందని సమాచారం. అంతేకాదు గతంలో నంద్యాల నుండి పోటీ చేసిన పివి నరసింహారావుపై ఏ పార్టీ పోటీ చేయనప్పటికీ బిజెపి బరిలోకి దించింది. అప్పటికి బిజెపికి రాష్ట్రంలో అసలు ఇప్పుడున్న ప్రాధాన్యత కూడా లేదంట. మరి ఎందుకు బరిలోకి దింపింది. అంటే సమాధానం గెలవకున్నా ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి తద్వారా పార్టీని బలోపేతం చేయడానికి. మరి ఇప్పుడు కడపలో తమ ఓటు బ్యాంకును కాపాడుకొని పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యం బిజెపికి ఎందుకు లేదు. జగన్‌తో కలిసినందుకేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి స్థానిక బిజెపి నేత కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర కమిటీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. మరి ఆ నాయకున్ని పోటీ చేయకుండా ఎందుకు నిలువరించింది. ఇవన్నీ చూస్తుంటే జగన్, బిజెపి మద్దతు అంతర్గంతంగా కనిపిస్తున్నందునే అనే సమాధానం రాజకీయ విశ్లేషకుల నుండి వస్తుంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
తెలుగు బ్లాగులన్నిటినీ ఒక చూపించే ప్రయత్నం లో " సంకలిని " అనే తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ని తయారు చేసాను
ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
ముందుమాట
అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
మీ వీలుని బట్టి ఒకసారి సంకలిని చూసి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు చేయమని ఈ కామెంట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను
-మీ బ్లాగ్ మిత్రుడు అప్పారావు శాస్త్రి