29, ఏప్రిల్ 2011, శుక్రవారం

చిన్నతనం నుంచీ కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 2011 సంవత్సరానికి గాను మొట్టమొదటి వనితా వేదిక కార్యక్రమం ఈ శనివారం డల్లాస్‌లోని రుచి ప్యాలెస్ రెస్టారెంట్‌లో జరిగింది. వనితా వేదిక కమిటీ చైర్ శిరీష బావిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చర్చా వేదిక, పాటలు, వీణా వాదన కార్యక్రమాలు సభికులను అలరించాయి. మధుమతి, దేవి ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటతో సభ ప్రారంభమైంది. సుష్మ ముగడ వీణాగానం, అపర్ణ వేదుల లలిత సంగీతం వీనుల విందుగా సాగాయి.


ఆ తర్వాత కమిటీ సభ్యులు మంజులత కన్నెగంటి, హిమ రెడ్డి, నీరజ పడిగెల, శారద పడాల, శ్రీదేవి అరవపల్లి చర్చా వేదికను నిర్వహించవలసిందిగా ప్యానల్ సభ్యులను ఆహ్వానించారు. మాతృత్వపు మధురిమలు, - టీనేజ్ పిల్లల పెంపకం అనే అంశంపై జరిగిన చర్చలో ఉష షేరి, సీత ములుకుట్ల, సురేఖ గంగసాని, సునీత కోసూరి, సంధ్య గవ్వా, రమా కాసెట్టి, మాధవీ రెడ్డి, సుగాత్రీశర్మ, లీల పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

చిన్నతనం నుంచీ కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని, బారతదేశంలో పెరిగే పిల్లలకు సహజంగా తెలిసే కుటుంబ విలువలు విదేశాలలో నివసించే పిల్లలకు తెలియజేయాలంటే తల్లదండ్రులు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు సభ్యులు వ్యక్తీకరించారు. పరిమితులు పాటిస్తూ చక్కని మార్గాన్ని పిల్లలకు నిర్దేశించాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించాలని అన్నారు. సుమారు గంటకు పైగా వాడిగా, వేడిగా సాగిన ఈ చర్చలో పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం చక్కటి నడవడికతో పిల్లలు పెరగడానికి గట్టి పునాది అనే అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. సుజన పాలూరి, సుష్మీ కోసూరి ఈ చర్చను ఆద్యంతం ఆసక్తికరంగా, సభికులందరినీ అనుసంధానం చేస్తూ నిర్వహించారు.

కామెంట్‌లు లేవు: