29, ఏప్రిల్ 2011, శుక్రవారం

వైయస్ జగన్ తన ప్రకటనతో ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు

అనాలోచితంగా అన్నారో, మనసులో మాటను బయట పెట్టారో గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్ చిక్కుల్లో పడ్డారు. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తాను బిజెపితో పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఆయన ఇరకాటంలో పడ్డారు. దాంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అవకాశంగా తీసుకుని వైయస్ జగన్‌ను లక్ష్యం చేసుకున్నాయి. దీని నుంచి బయటపడడానికి వైయస్ జగన్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోబోమంటూ తాను చేసిన ప్రకటనను పట్టించుకోకుండా, ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మాటకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలనే కాకుండా రామోజీ రావును కూడా తప్పు పడుతూ సాక్షి దినపత్రికలో శుక్రవారం ఓ వార్తాకథనం ప్రచురితమైంది.

బిజెపితో పొత్తు ఎంత అసాధ్యమో చెప్పడానికి వైయస్ జగన్ ఆ మాట అన్నారని, ఒక్క వ్యాఖ్యకు తెలుగుదేశం, కాంగ్రెసు, ఎల్లో మీడియా (ఈనాడు) వక్రభాష్యాలు అల్లుతున్నాయని సాక్షి ఆడిపోసుకుంది. దశాబ్దం పాటు బిజెపితో అంట కాగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. జగన్‌పై విమర్శలు చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించింది. బిజెపి అగ్రనేత అద్వానీతో చంద్రబాబు, రామోజీ రావు ఉన్న ఫొటోను వార్తాకథనంలో ప్రచురించింది. బిజెపి మతతత్వాన్ని పక్కన పెట్టి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమా అని సాక్షి ప్రశ్నించింది. మొత్తం మీద, సాక్షి మీడియా వార్తాకథనాన్ని బట్టి వైయస్ జగన్ తన ప్రకటనతో ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు

కామెంట్‌లు లేవు: