24, మే 2011, మంగళవారం

జూ. ఎన్టీఆర్ ఏం చేస్తారు?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ అధికారిక రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేశారు. తన రాజకీయ వారసత్వాన్ని నారా లోకేష్‌కు అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. నేరుగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలోకి తేకుండా క్రమంగా అక్కడికి చేరుకునేలా ఆయన పక్కా ప్రణాళికను రచించి అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పార్టీ ఇంచార్జీగా నియమించడం ద్వారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడానికి వీలు కల్పిస్తున్నారు. చంద్రగిరి మండల నాయకులు తీర్మానం చేసి పార్టీ మహానాడుకు పంపితే దాన్ని ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి గతంలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పోటీ చేశారు. ఆ తర్వాత సినీ నటి రోజా పోటీ చేశారు. తన స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గం బాధ్యతలను చంద్రబాబు ఇప్పుడు తన కుమారుడు లోకేష్ చేతిలో పెడుతున్నారు. చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యేలా చూసి రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే విధంగా ప్రణాళిక అమలవుతోందని తెలిసి పోతూనే ఉన్నది. నారా లోకేష్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడిన స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో తన తండ్రి హరికృష్ణ సహకారం పొందుతున్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతారనే చర్చ జరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ 2019 ఎన్నికలను లక్ష్యం చేసుకుని ముందుకు రావాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అందుకుగాను ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి పని చేయడం ద్వారా 2014లో చంద్రబాబు గెలవకుండా చూడాలని అనుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్‌తో పాటు నారా లోకేష్ లక్ష్యం కూడా 2014 ఎన్నికలే అవుతున్నాయి. అయితే, 2014లోనే చంద్రబాబు తప్పుకుని నారా లోకేష్‌కు పగ్గాలు అప్పజెప్తారని చెప్పలేం. దాదాపు పదేళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి, తగిన అనుభవం సంపాదించుకునే వరకు చంద్రబాబు మాత్రమే నాయకత్వం వహిస్తారు. కింది స్థాయి నుంచి ప్రజల ఆమోదంతో, పార్టీ కార్యకర్తలో ఆమోదంతో లోకేష్ వచ్చారని చెప్పడానికి తగిన ప్రాతిపదికను కూడా చంద్రబాబు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్‌కు ఇది పరీక్షా కాలమే.

కామెంట్‌లు లేవు: