24, మే 2011, మంగళవారం

చంద్రబాబు వ్యూహం కూడా తిరగబడేట్లే ఉంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజకీయాల్లో చాణక్యుడని, అతని వ్యూహం ముందు అందరూ చిత్తు కావాల్సిందేనని ఇప్పటి వరకు ఓ నమ్మకం ఉంటూ వచ్చింది. అంతేకాకుండా, ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత కష్టమైనా, నష్టమైనా తెలుగుదేశం పార్టీ భరిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉండేది. ప్రత్యర్థులనే కాదు, పార్టీ వ్యతిరేకులను తన వ్యూహాలతో దారికి తెచ్చుకునే నేర్పు చంద్రబాబుకు ఉందని అనుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీపై, పార్టీ నాయకులపై చంద్రబాబు పట్టు కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. తాను అనుసరించిన వ్యూహమే తన కొంప ముంచేలా ఉంది. తన దారిలో నడవని నేతలను కట్టడి చేయడానికి పార్టీలో వారికి వ్యతిరేకంగా మరో గ్రూపు తయారు చేసే చంద్రబాబు వ్యూహం బెడిసి కొడుతోంది.

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విషయంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహం పూర్తిగా బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. పార్టీ వైఖరిని నాగం జనార్దన్ రెడ్డి తూర్పారపడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, ఆ నిర్ణయాన్ని సమీక్షించి వెనక్కి తీసుకుంటారా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి పట్టులో అర్థం ఉంది. తెలంగాణ ప్రజల ముందు చంద్రబాబును నాగం జనార్దన్ రెడ్డి ద్రోహిగా నిలబెడుతున్నారు. ఇతర పార్టీల నాయకులు ఇప్పటికే కావాల్సినంత చంద్రబాబు వైఖరిని తప్పు పడుతూ వచ్చారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చంద్రబాబును నమ్మడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డే ముందుకు రావడంతో ఆయన పప్పులు ఉడికేట్లు లేవు. చంద్రబాబు అనుకూల తెలంగాణ ప్రాంత నాయకత్వం దుమ్ము దులిపేందుకు కూడా ఆయన వెనకాడడం లేదు.

ఇకపోతే, వారసత్వ పోరు నానాటికీ రాజకుంటోంది. తన కుమారుడు నారా లోకేష్‌ను తెర మీదికి తేవాలనే చంద్రబాబు వ్యూహం కూడా తిరగబడేట్లే ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి పార్టీ ఇంచార్జీగా నారా లోకేష్ పేరును ప్రకటించాలని ఆ ప్రాంత నాయకులు పట్టుబట్టడం కూడా చంద్రబాబుకు తలనొప్పిగానే పరిణమించింది. నారా లోకేష్‌ను అడ్డుకోవడానికి నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తమ అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. కృష్ణా జిల్లాలో దాని ప్రకంపనలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీని దారికి తెచ్చామని అనుకున్నా అది రగులుతూనే ఉన్నది.

తాజాగా, పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. బుచ్చయ్య చౌదరి పార్టీ నాయకత్వ తీరు పట్ల, అంటే చంద్రబాబు తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం మాత్రం నిర్ధారణ అయింది. నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత నాయకులను చంద్రబాబు ఉసిగొల్పినా అది ఫలితం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. సీమాంధ్ర సీనియర్ నాయకులు పార్టీ వ్యవహారాల పట్ల పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద, చంద్రబాబు కోలుకోలేని స్థితిలోకి జారుకుంటున్నారని మాత్రం అనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు: