24, మే 2011, మంగళవారం

జూనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇంచార్జీ??

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్ ప్రారంభమైంది. పార్టీ మహానాడుకు ముందే తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు ముదురుతోంది. తెలంగాణలో సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం రగులుతున్న సమయంలోనే వారసత్వ పోరు కొత్త రూపు ధరించడం విశేషం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి నారా లోకేష్‌ను ఇంచార్జీగా ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించుకున్న సమయంలోనే కృష్ణా జిల్లా రాజకీయాలు దానికి కౌంటర్‌గా ప్రారంభమయ్యాయి.

కృష్ణా జిల్లాలోని ఏదో ఒక శాసనసభా నియోజక వర్గం ఇంచార్జీగా జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రకటించాలని కోరుతూ జిల్లా నాయకత్వం తీర్మానం చేయడానికి సిద్ధపడుతోంది. మంగళవారం మధ్యాహ్నం బందరులో కృష్ణా జిల్లా పార్టీ సమావేశం జరుగుతోంది. ఇందులో మహానాడులో ప్రతిపాదించే తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను ఏదో ఒక నియోజకవర్గం ఇంచార్జీగా నియమించాలనే తీర్మానం పురుడు పోసుకుంటుందని అంటున్నారు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణా నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఇంచార్జీగా వ్యవహరించడానికి అనువైన నియోజకవర్గాన్ని కూడా పార్టీ నాయకులు గుర్తించనున్నారు.

తన కుమారుడు లోకేష్‌ను చంద్రగిరి నియోజక వర్గం ఇంచార్జీగా నియమించాలనే చిత్తూరు జిల్లా పార్టీ నాయకుల ఒత్తిడిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో వారసత్వ పోరు రగలడం చంద్రబాబుకు కాస్తా ఇబ్బందిగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా పరిణమించింది. ఇదే సమయంలో వారసత్వ పోరు కొత్త మార్గంలో తలకు చుట్టుకుంటుండడం చంద్రబాబు అసహనానికి కారణమని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: