24, మే 2011, మంగళవారం

నారా లోకేష్ వర్సెస్ వైయస్ జగన్

రాష్ట్ర రాజకీయాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్సెస్ నారా లోకేష్‌గా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అందుకుగాను ఈ నెల 28వ తేదీన జరిగే మహానాడులో తీర్మానం చేసి తన కుమారుడు నారా లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెస్తున్నారు. తాను ఇప్పుడే పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చంద్రబాబు అనుకోవడం లేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి లోకేష్‌ను జగన్‌కు దీటుగా నిలబెట్టి పార్టీ విజయానికి వాడుకోవాలని ఆయన చూస్తున్నట్లు అనుకోవచ్చు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి ఆ కోరిక మేరకే నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పడానికి తగిన రంగాన్ని చంద్రబాబు సిద్ధం చేశారు.

వైయస్ జగన్ కాంగ్రెసుకే కాకుండా నారా చంద్రబాబునాయుడికి కూడా బలమైన సవాల్ విసురుతున్నారు. చెప్పాలంటే, ఆయన ఎక్కువగా చంద్రబాబునాయుడినే లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని పదే పదే ఆరోపించడం ద్వారా తెలుగుదేశం అస్తిత్వాన్ని, మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు, ఏ మాత్రం వ్యవధి ఇవ్వకుండా వైయస్ జగన్ కార్యక్రమం మీద కార్యక్రమం తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. కడప ఉప ఎన్నికల్లో ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు సమస్యలపై గుంటూరులో దీక్ష చేపట్టారు. మంగళవారం నుంచి విజయవాడ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. తెరిపి లేకుండా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లడానికి వైయస్ జగన్‌కు వయస్సు సహకరిస్తోంది.

జగన్‌కు దీటుగా ముందుకు సాగడానికి చంద్రబాబుకు వయస్సు అడ్డుపడుతోంది. అంత విస్తృతంగా పర్యటించడం చంద్రబాబు వల్ల కాదనేది తెలిసిపోతూనే ఉన్నది. ఈ స్థితిలో నారా లోకేష్‌ను రంగం మీదికి తెచ్చి, జగన్‌తో పోటీ పడేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. చంద్రబాబు తన స్థానాన్ని పదిలం చేసుకుని, తిరిగి అధికారం చేపట్టడానికి నారా లోకేష్ ఓ అస్త్రంగా పనికి వస్తారని భావిస్తున్నారు. నారా లోకేష్ తనను దింపడానికి ప్రయత్నం చేసే అవకాశాలు లేవు కాబట్టి మరింత కాలం తాను నాయకత్వం నెరపడానికి, ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. తమిళనాడులో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కూడా రెండు ప్రాంతీయ పార్టీల ప్రాబల్యానికి అలవాలంగా మారుతుందని అంటున్నారు. ఈ స్థితిలో తమిళనాడులో కరుణానిధికి స్టాలిన్ పనికి వచ్చినట్లుగా రాష్ట్రంలో నారా లోకేష్ తనకు పనికి వస్తారని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ జోరును తట్టుకోవడం నారా లోకేష్ వల్లనే అవుతుందని అనుకుంటున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు నారా లోకేష్ వర్సెస్ వైయస్ జగన్‌గా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Nara Lokesh VS Jagan

Joke of this century..Nara Lokesh gaaru inko vanda janmalu ettalemo??