24, మే 2011, మంగళవారం

పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఇటు నారా, అటు నందమూరి కుటుంబాల మధ్య వారసత్వ పోరు జరుగుతున్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ కుమార్‌కు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా బాబు సొంత జిల్లా చిత్తురు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలను నారా లోకేష్ కుమార్‌కు అప్పగించేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా నారావారిపల్లె కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది.

అయితే చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెసు హవా కూడా ఉంది. అక్కడ పులివెందులలా ఏకపక్షంగా లేదు. దీంతో అక్కడి టిడిపి చంద్రగిరి నియోజకవర్గానికి లోకేష్‌ను ఇంఛార్జ్‌గా నియమిస్తే పార్టీ బాగా బలపడుతుందని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినేత దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయడానికి లోకేష్‌ను చంద్రగిరి నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించాలనే తీర్మానాన్ని మంగళవారం జిల్లా పార్టీ సమావేశంలో ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. అలా అయితే అది జిల్లా సమావేశంలో వీజీగానే ఆమోదం పొందుతుంది.

ఎలాగూ తనయుడి రాజకీయ ప్రవేశానికి తహతహలాడుతున్న చంద్రబాబు కూడా దానిని ఆమోదించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు ఈ తీర్మానాన్ని త్వరలో జరిగే మహానాడులో ప్రవేశ పెట్టి ఆమోదించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంట.
అయితే లోకేష్ కుమార్ కోసం జిల్లా పార్టీ నేతలు తీర్మానం ప్రవేశ పెట్టాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారని కూడా పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

కామెంట్‌లు లేవు: