5, మే 2011, గురువారం

అతని గురించి తమకేమీ తెలియదని పాకిస్తాన్ చెబుతూ వస్తోంది

అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ఉదంతంతో పాకిస్తాన్ అసలు రంగు బట్టబయలైంది. ఉగ్రవాదులకు, అండర్ వరల్డ్ శక్తులకు పాకిస్తాన్ అడ్డాగా మారిందనే భారత వాదనకు బలం చేకూరింది. భారత ప్రభుత్వం తగిన సాక్ష్యాధారాలతో తమకు కావాల్సిన దోషుల పేర్లను ఇచ్చినప్పటికీ వారెవరూ తమ దేశంలో లేరని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. కరాచీ నుంచి దావూద్ ఇబ్రహీం తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నా అతని గురించి తమకేమీ తెలియదని పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. దుబాయ్‌లో దావూద్ కూతురు పెళ్లి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారుడితో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విషయం ప్రపంచానికంతా తెలుసు. అయినా దావూద్ గురించి తమకేమీ తెలియదని పాకిస్తాన్ మొండిగా చెబుతోంది.

కరాచీలో దావూద్‌తో పాటు అతని సోదరుడు అనీస్, చోటా షకీల్, టైగర్ మెమెన్, అఫ్తాబ్ భక్తి, ఎడ్డా యాకూబ్, ఫాహిమ్ మచ్మచ్ కూడా కరాచీలో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. ఆ జాబితా చాలా పెద్దగా ఉంది. ముంబై రైలు పేలుళ్ల నిందితులు రియాజ్ భక్తల్, అతని సోదరుడు ఇక్బాల్ భక్తల్ కూడా పాకిస్తాన్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు. యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌తో భారత్ అప్పగింత ఒప్పందం చేసుకున్న తర్వాత 1990 దశకంలో భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాకిస్తాన్‌కు తరలడం ప్రారంభమైంది.

దావూద్ తన అనుచరులతో పాటు కరాచీలోని క్లిఫ్టన్ ఏరియాలో ఉంటున్నాడని తగిన సాక్ష్యాధారాలతో భారత్ పాకిస్తాన్‌కు తెలిపింది. లాడెన్ మృతిని బట్టి వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉంటున్నారనేది మరింత స్పష్టమైందని భారత హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. భారత అబూ సలేం, బంటీ పాండే వంటివారిని భారత్‌కు విదేశాల నుంచి తీసుకు రాగలిగింది. కానీ పాకిస్తాన్ విషయంలోనే సమస్య ఎదురవుతోంది. అయితే, అమెరికా లాగా పాకిస్తాన్‌లో దాడులు చేయడం భారత్‌కు సాధ్యం కాదు.

కామెంట్‌లు లేవు: