5, మే 2011, గురువారం

కడపలో తగిన ఫలితం సాధిస్తే చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో తిరుగు ఉండకపోవచ్చు

కడప, పులివెందుల లోకసభ, శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి మధ్యన జరుగుతున్నవేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్ జగన్‌కు పోటీగానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం చిరంజీవిని తన పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనకు ప్రధాన ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించి, 2014 ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో చిరంజీవి తన దూకుడును, విమర్శల ధాటిని వైయస్ జగన్‌కు చవి చూపించారు.

కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి ఓడినా, వైయస్ జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించుగలితే దాని క్రెడిట్ చిరంజీవికి దక్కే అవకాశం ఉంది. చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా వైయస్ జగన్‌పై వ్యక్తిగత దాడికి దిగారు. జగన్ వ్యవహారంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డికి పెట్టని కోట అయిన పులివెందులలో అడుగు పెట్టి, తన విమర్శల దాడిని కొనసాగించారు.

చిరంజీవిని కూడా వైయస్ జగన్ తన ప్రత్యర్థిగానే చూస్తున్నారు. చిరంజీవితో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకుందనే వార్తలు వెలుగులోకి వచ్చిన వెంటనే వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలతో వార్తాకథనాలను ప్రసారం చేయడం ప్రారంభించింది. చిరంజీవిని ఆహ్వానించడంతోనే 2014 ఎన్నికల నాటికి కూడా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెసు తరఫున ముందుకు వచ్చే అవకాశాలు లేవని జగన్ తేల్చుకున్నట్లు చెప్పవచ్చు. కడపలో తగిన ఫలితం సాధిస్తే చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో తిరుగు ఉండకపోవచ్చు.

కామెంట్‌లు లేవు: