5, మే 2011, గురువారం

ఆంధ్రా నాకు తెలంగాణ నీకు!

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రభుత్వం కూలిపోయి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికలు రావద్దని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తండ్రి అయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం, పార్లమెంటు సభ్యుత్వానికి రాజీనామా, పార్టీ నుండి వెళ్లి పోవడం తదితర పరిణామాల దృష్ట్యా ప్రజలలో కలిగిన సానుభూతిని ఓటింగ్‌గా మలుచుకునే ఉద్దేశ్యంతో జగన్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు కోరుకుంటున్నారు. అందుకే ఆయన తనకు ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఉందనే వ్యాఖ్యలను మరోసారి తెరమీదకు తెస్తున్నారు. అయితే ఇలా ప్రభుత్వాన్ని పడగొడతానని, ఉప ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం వస్తుందని కడప జిల్లా వోటర్లను మభ్య పెట్టడానికే అలా వ్యాఖ్యానిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జగన్‌కు అంత సామర్థ్యం ఉంటే ఇన్నాళ్లు ఎందుకు నిరీక్షిస్తాడనే వారూ ఉన్నారు. కేవలం వోటర్లను బెదిరింపులకు గురిచేసి మభ్య పెట్టడానికే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది.


కడప ఉప ఎన్నికలు అయ్యాక ఆరునెలల్లోగా ఎన్నికలు వస్తాయని జగన్ చెప్పడం అంతా వట్టిదేనని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడానికి జగన్ సిద్ధంగా ఉన్నప్పటికీ జగన్‌తో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. తనకు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదని జగన్‌కు తెలిసినప్పటికీ రాజీనామా చేసినప్పటి నుండి ప్రభుత్వాన్ని పడగొడతానని బెదిరించడం ప్రజల్లో అస్పష్టత కల్పించడంలో భాగమేననే పలువురు భావిస్తున్నారు. జగన్ వర్గం వారు ఎన్నికలకు సిద్ధంగా లేక పోవడమే కాకుండా ఎంఐఎం, పిఆర్పీ కలిసి కాంగ్రెసుకు చేయూత నిచ్చేందుకు సిద్ధపడటం జగన్ ఎన్నికల అత్యుత్సాహానికి దెబ్బ కొడుతున్నాయి. అయితే తనపై సానుభూతి విరివిగా ఉన్న సమయంలో ఎన్నికలు వస్తే మాత్రం తనకు అందరికంటే ఎక్కువ సీట్లు రావడం ఖాయంగా జగన్ భావిస్తున్నారు.

ఇక జగన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ కూడా ఎన్నికలను వీలైనంత త్వరగా కోరుకుంటున్నారు. గత సంవత్సరంన్నరగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమం కారణంగా టిఆర్ఎస్‌కు పదేళ్లలోలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే సీమాంధ్రలో జగన్ హవా కొనసాగితే, తెలంగాణలో టిఆర్ఎస్ హవా కొనసాగుతుంది. కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు పడదోస్తాడా అని గుంటనక్కలా కాచుకు కూచున్నట్లు కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వాన్ని పడదోస్తే టిఆర్ఎస్‌కు 70 సీట్ల వరకు రావచ్చని ఓ అభిప్రాయం. అయితే రెండు మూడు నెలలుగా టిఆర్ఎస్ ప్రభావం 70 నుండి తగ్గుతూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ దశలో కెసిఆర్ వీలైనంత త్వరగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.

కెసిఆర్, జగన్ ఎన్నికల కోసం ఎదురు చూస్తుంటే కాంగ్రెసు, టిడిపి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. తెలంగాణ ఉద్యమం, జగన్ ప్రభావం నేపథ్యంలో టిడిపి, కాంగ్రెసు సంఘర్షణలో పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఆ రెండు పార్టీలు ఎన్నికలకు ఏమాత్రం సిద్ధంగా లేవు. రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో టిడిపి ప్రభావం కోల్పోగా, కాంగ్రెసుకు సొంత ఇంటిలోనే తెలంగాణ పోరు, జగన్ హోరు కష్టంగా పరిణమించింది. దీంతో ఈ రెండు పార్టీలు ఎన్నికలకు ఏమాత్రం రెడీగా లేవు.

కామెంట్‌లు లేవు: