5, మే 2011, గురువారం

సోవియట్‌పై పోరాటానికి అమెరికానే ఒసామా బిన్ లాడెన్‌ను పెంచి పోషించిందనేవారున్నారు.

బహుశా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడి కన్నా ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెనే పాపులర్ అయి ఉంటాడు. అమెరికాలో 2001 సెప్టెంబర్ 11వ తేదీన దాడులు నిర్వహించిన తర్వాత ప్రపంపవ్యాప్తంగా అతని పేరు మారు మోగిపోయింది. అమెరికాను గడగడలాడించిన లాడెన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాగాడనేది ఆసక్తికరమైన విషయమే. ఒసామా బిన్ మొహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ 1957 మార్చి 10వ తేదీన జన్మించాడు. హింసాత్మకమైన జిహాదీ ఉద్యమం చేపట్టడం వల్ల లాడెన్ సౌదీ అరేబియా పౌరసత్వాన్ని కోల్పోయాడు. అతని బిలియనీర్ ఫ్యామిలీ అతన్ని దూరం చేసుకుంది. అతనితో తమకు సంబంధం లేదని ప్రకటించుకుంది.


లాడెన్ తండ్రి మొహమ్మద్ బిన్ అవాద్ లాడెన్ సంపన్నమైన వాణిజ్యవేత్త. సౌదీ రాచకుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలుండేవి. మొహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ పదో భార్య హమీదా ఆల్ - అత్తాస్ ఏకైక పుత్రుడు లాడెన్. లాడెన్ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఒసామా తల్లి ముహమ్మద్ ఆల్ - అత్తాస్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. లాడెన్ వారితో కలిసి ఉండేవాడు. లాడెన్ 1968 నుంచి 1976 వరకు వాహబీ ముస్లిం పద్దతుల్లో పెరిగాడు సంపన్నమైన లౌకిక ఆల్ - తాగర్ మోడల్ స్కూల్లో చదివాడు కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక, వాణిజ్య యాజమాన్య శాస్త్రాలు చదివాడు. 1979లో సివిల్ ఇంజనీరింగ్, 1981లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాడని అంటారు. అయితే, మూడో సంవత్సరంలోనే చదువును ఆపేశాడని చెబుతారు. అయితే, విశ్వవిద్యాలయంలో ఖురాన్, జిహాద్, సేవా కార్యక్రమాలను అన్వయం చేసే కార్యక్రమాల్లో మునిగిపోయినట్లు చెబుతారు. లాడెన్ కవిత్వం కూడా రాశాడు.

లాడెన్ తన 18 ఏళ్ల వయస్సులో లటాకియాలో నజ్వా ఘేనంను వివాహం చేసుకున్నాడు. లాడెన్ 2002లో నలుగురు స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. లాడెన్‌కు 25 లేదా 28 మంది పిల్లలు ఉంటారని చెబుతారు. లాడెన్ తండ్రి ముహమ్మద్ బిన్ లాడెన్ 1967లో సౌదీ అరేబియాలో విమాన ప్రమాదంలో మరణించాడు. అమెరికా పైలట్ ల్యాండింగ్ విషయంలో తప్పుడు సంకేతాలు ఇవ్వడంతో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లాడెన్ సవతి సోదరుడు, కుటుంబ పెద్ద సలీం బిన్ లాడెన్ 1988లో అమెరికాలోని టెక్సాస్ సాన్ ఆంటోనియోలో విమాన ప్రమాదంలో మరణించాడు.

షరియా పునరుద్ధరణ వల్ల ముస్లిం ప్రపంచం సరైన మార్గంలో నడుస్తుందని లాడెన్ విశ్వసించేవాడు. పాన్ - అరబిసమ్, సోషలిజం, కమ్యూనిజం, ప్రజాస్వామ్యాలను వ్యతిరేకించాలని ఉపదేశించేవాడు. ఈ విశ్వాసాలతో హింసాత్మక కార్యక్రమాలను విస్తరించిన జిహాదీని తొలుత ఖుట్బిజం అని పిలిచేవారు. ముస్లిం ప్రపంచంలో తాలిబన్ నేత ముల్లా ఒమర్ ప్రభుత్వ హయాంలోని అఫ్షనిస్తాన్‌ను ఏకైక ఇస్లామిక్ దేశమని భావించేవాడు. ఆ ప్రభుత్వ సాయాంతో అమెరికా, ఇతర ముస్లిం వ్యతిరేక దేశాలపై పోరాటం సాగించాలని లాడెన్ ఆల్ ఖైదాను స్థాపించాడు. ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, మధ్య ప్రాచ్య దేశాల నుంచి అమెరికా సైన్యాలను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశాడు.

అప్షనిస్తాన్‌పై సోవియట్ దాడిని తిప్పికొట్టడానికి లాడెన్ 1979లో అబ్దుల్లా ఆజ్జంతో చేతులు కలిపాడు. కొంత కాలం పెషావర్‌లో ఉన్నాడు. సోవియట్‌పై పోరాటానికి ఏర్పడిన ముక్తబ్ ఆల్ ఖిదమత్‌ను 1988లో చీల్చి ఆల్ ఖైదాను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వివిధ దేశాల్లో దాడులకు లాడెన్ కుట్ర చేశాడు. సోవియట్‌పై పోరాటానికి అమెరికానే ఒసామా బిన్ లాడెన్‌ను పెంచి పోషించిందనేవారున్నారు. అతనే చివరికి అమెరికాకు కూడా కొరకరాని కొయ్యగా తయారయ్యాడని చెబుతారు.

కామెంట్‌లు లేవు: