12, మే 2011, గురువారం

ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం??

తన బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణకు కోపం చల్లారలేదని అంటున్నారు. అధికార మార్పిడి సందర్బంగా తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు, ఆ తర్వాత తనకు జరిగిన అవమానం పట్ల ఆయన రగిలిపోతూనే ఉన్నారట. లక్ష్మీపార్వతిపై తమకు ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు వాడుకుని తన తండ్రిని పదవీచ్యుతుడ్ని చేశాడని, అందుకు తమను వాడుకుని ఆ తర్వాత తమను కూడా వదిలేశారని ఆయన భావిస్తున్నారని సమాచారం. అందుకు తగిన ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే హరికృష్ణ ఉన్నారని అంటున్నారు. పైగా, నందమూరి కుటుంబానికి చెందిన తెలుగుదేశం పార్టీని తమకు కాకుండా చేసేందుకు మరో పథకాన్ని చంద్రబాబు రచించడం కూడా ఆయనకు నచ్చడం లేదు.

నందమూరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధంగా లేరని, పార్టీని తన కుమారుడు నారా లోకేష్ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించిన హరికృష్ణ పార్టీని సొంతం చేసుకుని, స్వర్గీయ ఎన్టీఆర్ వారసులుగా రాజకీయాల్లో నిలబడాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ముందు పెట్టేందుకు ఆయన సిద్ధపడ్డారని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ తాత లక్షణాలను పుణికిపుచ్చుకోవడం అందుకు కలిసి వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీ రామారావుపైకి వైస్రాయ్ హోటల్ వద్ద చంద్రబాబు మనుషులు చెప్పులు విసరడాన్ని హరికృష్ణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో తనకు, తన మరో బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు అధికార మార్పిడి తర్వాత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రధానమైన పాత్ర లభిస్తుందని హరికృష్ణ ఆశించారు. ఆ మేరకు చంద్రబాబు హామీ కూడా ఇచ్చారని అంటున్నారు. అయితే, అధికారం తన చేతికి రాగానే చంద్రబాబు వారిద్దరని పక్కన పెట్టేశారు. దాంతో అసంతృప్తికి గురైన వారిద్దరు బయటకు వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొంత కాలం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశంతో ఉన్నారు. అదీ పొసగలేదు. దీంతో దగ్గుబాటి, హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అది తగిన ఆదరణ పొందలేదు.

అన్న తెలుగుదేశం పార్టీ తగిన ఫలితాలు సాధించకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు బిజెపిలోకి, ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోయారు. హరికృష్ణ మాత్రం చంద్రబాబుతో సర్దుకుపోతూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే, ఆయన పెద్దగా పార్టీ కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రచారానికి దిగలేదు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు. ఆ సందర్భంగా బాలకృష్ణ కన్నా జూనియర్ ఎన్టీఆర్‌కే ఆదరణ ఎక్కువగా లభించింది. స్పష్టమైన వాచకం, విషయాల అవగాహన ఎన్టీఆర్‌ను బలంగా తయారు చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను ఆలంబనగా చేసుకుని తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబ సభ్యుల సొంతం చేయడం హరికృష్ణ లక్ష్యంగా చెబుతున్నారు

కామెంట్‌లు లేవు: