ఏరు దాటాక తెప్పను తగిలేయడం కాంగ్రెసు సంస్కృతి అనే మాట మరోసారి రుజవు అవుతోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మాటలకు బోల్తా పడిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇప్పుడు గిలగిలా తన్నుకుంటున్నట్లే ఉన్నారు. పిలిచి సింహాసనం ఇస్తామని చెప్పిన సోనియా గాంధీ ఇప్పుడు చిరంజీవికి మొండిచేయి చూపుతున్నట్లే ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెసులో నెంబర్ వన్‌గా నిలబడాలని అనుకున్న చిరంజీవి ఆశలకు ఆదిలో కాంగ్రెసు అధిష్టానం గండి కొడుతోంది. విలీన సభను అట్టహాసంగా నిర్వహించి తన సత్తాను సోనియా గాంధీకో, రాహుల్ గాంధీకో చూపాలని ఆయన కలలు కంటూ వస్తున్నారు. ఆ కలలను కాంగ్రెసు అధిష్టానం చిదిమేసేదుకు ఏ మాత్రం వెనకాడడం లేదు.
కాంగ్రెసు చేతికి చిక్కిన చిరంజీవి ఇప్పుడు ఎటూ పోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఒడ్డున పడిన చేపలా విలవిలలాడుతున్నారు. గతంలో అడక ముందే అపాయింట్‌మెంట్ ఇచ్చిన సోనియా ఇప్పుడు అడిగినా ఇవ్వడం లేదు. విలీన సభకు రాహుల్ గానీ, సోనియా గానీ రారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చిరంజీవికి మొహమాటం లేకుండా చెప్పేశారని అంటున్నారు. అంతేకాదు, భారీగా విలీన సభను జరపాల్సిన అవసరం లేదని, తమ పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకుంటామని కూడా ఆయన చెప్పారట. దీంతో కంగు తినడం చిరంజీవి వంతైంది. వెనక్కి రాలేక ముందుకు పోలేక చిరంజీవి గిజగిజలాడుతున్నట్లే చెప్పాలి.
చిరంజీవికి రాష్ట్రంలో అంత సీన్ లేదని, అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని కాంగ్రెసు నాయకులెవరో సోనియాకు పూస గుచ్చినట్లు చెప్పారని సమాచారం. అంతేకాదు, చిరంజీవిని ప్రోత్సహిస్తే ఓ వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, దాని వల్ల బలమైన సామాజిక వర్గం ఒకటి దూరమయ్యే ప్రమాదం ఉందని సోనియాకు చెప్పారని సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య విభేదాలను, వైరాలను చిరంజీవిని దెబ్బ తీయడానికి వాడుకున్నట్లు చెబుతున్నారు. దానికి తోడు, రెడ్లు లేకుండా కాంగ్రెసు మనుగడ సాగించడం కూడా కష్టమని చెప్పారని తెలుస్తోంది. చిరంజీవిని ఎక్కువగా ఆదరిస్తే రెడ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వైపు చూసే అవకాశం ఉందని కూడా చెప్పారని అంటారు. ఏమైనా, కాంగ్రెసులో ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎవరు పైకొస్తారో, పాతాళానికి దిగజారుతారో చెప్పడం సాధ్యం కాదని మరోసారి రుజువు అయిందని చెప్పవచ్చు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి