కడప ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంటూ వచ్చారు. ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు, వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఊదరగొడుతూ వస్తున్నారు. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్, పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ విజయం ఖాయమని కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఓ నిర్ధారణకు వచ్చినట్లే కనిపిస్తోంది. అందువల్ల ఇప్పుడు ఫలితాలపై పెద్దగా ఉత్కంఠ లేదు. జగన్‌కు లభించే మెజారిటీపై, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల్లో ఏది రెండో స్థానంలో నిలుస్తుందనేది విషయంపై మాత్రమే ఆసక్తి ఉంది.
జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తాయని గ్యారంటీగా చెప్పలేం. జగన్ వెంట వెళ్తున్న నలుగురు శాసనసభ్యులకు మాత్రమే కాంగ్రెసు ఇప్పటి వరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటికి ఆ శాసనసభ్యులు వివరణలు కూడా ఇచ్చారు. కానీ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదు. జగన్ వెంట దాదాపు 23 మంది కాంగ్రెసు శాసనసభ్యులు వెళ్తున్నారు. వారందరిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదు. అదే సమయంలో కాంగ్రెసును పూర్తిగా కాదని వెళ్తారా అనేది సందేహమే.
కాగా, ఉప ఎన్నికల ఫలితాలు జగన్‌కు కొత్త ఊపునిచ్చే అవకాశాలున్నాయి. అయితే, జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు ఉప ఎన్నికల తర్వాత రాజీనామాలకు సిద్ధపడతారనే వార్త గత కొద్ది రోజులుగా వస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా అదే మాట చెప్పారు. అయితే, వ్యూహాన్ని జగన్ ఆహ్వానిస్తారా, లేదా అనేది సందేహమే. షోకాజ్ నోటీసులు జారీ చేసిన నలుగురు శాసనసభ్యులపై చర్యలు తీసుకుని, మిగతావారిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటే మాత్రమే ఆ పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. అందుకు కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తుందా అనేది సందేహమే.
రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగించడానికే ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయి. అయితే, తెలంగాణ అంశం కిరణ్ కుమార్ రెడ్డి పదవికి ఎసరు పెట్టే అవకాశాలున్నట్లు వైయస్ జగన్ వర్గం భావిస్తోంది. అయితే, తెలంగాణ శాసనసభ్యులు అంత దూరం పోతారని అనుకోవడానికి కూడా ఏమీ లేదు. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వచ్చే శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడానికి మాత్రమే సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. ఆయన సత్వరం తెలంగాణ అంశంపై తేల్చుకోవడానికి ఏమీ తొందర పడడం లేదని అంటున్నారు. ఈ స్థితిలో కడప ఉప ఎన్నికల తర్వాత భారీ మార్పులు సంభవిస్తాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. అయితే, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి