12, మే 2011, గురువారం

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశాo

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి గురువారం ఎంపీ, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బావమరిది హరికృష్ణ, తెలంగాణ అంశంపై పార్టీపై తిరుగుబాటు చేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి హాజరు కావడం పలువురుని విస్మయానికి గురి చేసింది. గత కొంతకాలంగా హరికృష్ణ - చంద్రబాబు మధ్య వారసత్వ పోరు నడుస్తున్నట్టుగా వాదనలు వస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు తర్వాత టిడిపి వారసుడిగా నందమూరి వంశమే ఉండాలనిచూస్తున్న హరికృష్ణ, చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించడం జీర్ణించుకోలేక పోతున్నారనేది వార్తల సారాంశం. బాబు తర్వాత నారా వంశానికి చెక్ పెట్టేందుకు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపైకి తెచ్చారు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య ఎక్కడా ప్రత్యక్షంగా గొడవలు జరగనప్పటికీ పరోక్షంగా మాత్రం ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. అది నిజమేనన్నట్లు పెళ్లి సంబంధాన్ని సెట్ చేసిన చంద్రబాబే జూ.ఎన్టీఆర్ పెళ్లిలో ముక్తసరిగా కనిపించడం వారి మధ్య వారసత్వ పోరు నడుస్తున్నదనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి.

ఇక నాగం జనార్ధన్ రెడ్డి కూడా గత కొన్నాళ్లుగా పార్టీలో ఉంటూనే కాలికి ముల్లులా తయారయ్యాడు. తెలంగాణకు అనుకూలంగా పార్టీలు నిర్ణయం తీసుకోకుంటే మనుగడ సాగించలేవని టిడిపిలో ఉంటూనే విమర్శలు చేశారు. అధినేత చంద్రబాబుపై కూడా పరోక్షంగా ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నాగం, హరికృష్ణలు పార్టీ సమావేశానికి రారని అందరూ భావించారు. కానీ వారిద్దరూ సమావేశాలకు రావడం అందరికీ విస్మయం కలిగించింది. అయితే సమావేశంలో, తర్వాత వారు ఏమి మాట్లాడుతారో అనే దానిపై ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఉన్నారు.

కామెంట్‌లు లేవు: