ప్రస్తుతం జరుగుతున్న ఐపియల్4లో తెలుగు క్రికెటర్ల హవా జోరుగానే ఉంది. జాతీయ జట్టులో వారికి తగిన ప్రాతినిధ్యం లభించకపోవయినప్పటికీ ఐపియల్‌లో మాత్రం ఓ వెలుగు వెలుగుతున్నారు. వివిధ జట్లలో వారు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. వారిలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న అంబటి తిరుపతి రాయుడి సంగతి చెప్పనే అవసరం లేదు. అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మన్ననలు అందుకున్నాడు. ఓ నమ్మకమైన బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. దానికితోడు కీపింగ్ కూడా చేస్తున్నాడు. ట్వంటీ20 అంటే గుడ్డిగా బంతిని బాదడమనేది అతను చేయడం లేదు. ఆటలో చక్కటి సాంకేతికతను ప్రదర్శిస్తున్నాడు. చెప్పాలంటే, అలాంటి శాస్త్రీయమైన ఆట తెలుగు క్రికెటర్లకు వెన్నతో అబ్బిందని చెప్పవచ్చు.
కాగా, ముంబై ఇండియన్స్‌లోనే మరో ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. అతను భారీ షాట్లకు పెట్టింది పేరు. రోహిత్ శర్మ తల్లి అన్నపూర్ణది విశాఖపట్నం. అందువల్ల, ఇతడ్ని కూడా తెలుగువాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. గత ఐపియల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు బ్యాట్‌తోనూ బంతితోనూ అద్భతంగా రాణించాడు. భారత వన్డే జట్టులో అతను నిలకడగా ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడుతున్న వేణుగోపాల రావు కూడా ఐపియల్‌లో బాగా రాణిస్తున్నాడు. మాజీ క్రికెటర్లు అతన్ని గుండప్ప విశ్వనాథ్‌తో పోలుస్తున్నారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐపియల్‌లో పరాజయం పాలవుతుండడంతో వేణుగోపాల్ రావు ప్రతిభ వెలుగులోకి అంతగా రావడం లేదు. అయితే, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో అతను రాణిస్తున్నాడనే మాటను మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో సంచలనం సృష్టిస్తున్న పాల్ వాల్తాటీ మన తెలుగువాడే. అతను కర్నూలు జిల్లా నంద్యాలకు చెందినవాడు. అయితే, అతని తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా ముంబైకి వెళ్లారు. అతను ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేవనే చెప్పవచ్చు. కానీ, ఐపియల్‌లో మాత్రం అతని పేరు మారుమోగుతోంది. అయితే, ఇటీవలి మ్యాచుల్లో అతను వెనకబడి పోయాడు.
ఇక, హైదరాబాద్ మణికట్టు మాంత్రికుడు వివియస్ లక్ష్మణ్ కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ఆడుతున్నాడు. అయితే, లక్ష్మణ్ ట్వంటీ20 ఫార్మాట్‌కు పనికి రాడనే అభిప్రాయం బలంగా ఉంది. కానీ, ఆడిన ఒకటి, రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. కాగా, హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ తరఫున స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆడుతున్నాడు. నిరుడు కూడా అతను ఇదే జట్టులో ఉన్నాడు. నిరుడు రాణించిన స్థాయిలో అతను ఇప్పుడు రాణించడం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి