ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒత్తిడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఆపరేషన్ 500 కోట్లు అనే శీర్షికతో ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. అవసరమైతే శాసనసభ్యులను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని పార్టీ నాయకుల నుంచి జగన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒక్కో శాసనసభ్యుడికి ఐదు కోట్ల వరకు ఆఫర్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు జగన్ వర్గం ఓ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలస్యం చేస్తే పార్టీ బలహీనతలు బయటపడతాయని, వేడిలో వేడిగా ప్రభుత్వాన్ని కూల్చే ప్రణాళికను అమలు చేయాలని అంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ కూడా 2014 వరకు వేచి చూసే ఉద్దేశంతో లేరని అంటున్నారు. ప్రస్తుతం జగన్ వెంట 25 మంది దాకా శాసనసభ్యులున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలంటే 70 మందికి పైగా శానససభ్యుల అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి గానీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు.
తెలంగాణలో పార్టీ బలహీనపడిన నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలను చంద్రబాబు కోరుకోవడం లేదు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోక ముందే ప్రభుత్వాన్ని కూల్చాలని వైయస్ జగన్ వర్గం భావిస్తుండగా, తెలంగాణపై నిర్ణయం తీసుకునే వరకు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది. పైగా, జగన్ వైపు నుంచి శాసనసభ్యులు క్రమంగా వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే కాంగ్రెసు శాసనసభ్యురాలు కమలమ్మ, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాం రెడ్డి వెనక్కి వెళ్లిపోయారు. ప్రభుత్వాన్ని కూల్చడంలో జాప్యం చేస్తే మరింత ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని జగన్ భావిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతోనే జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కలిసి వస్తుంది. అయితే, ఆ పార్టీ 11 మంది సభ్యుల బలం అందుకు సరిపోదు. పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి